భారీ వర్షం దెబ్బకు తిరుమల ఘాట్ రోడ్లు మూసివేత..

అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా తో పాటు తిరుపతిలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. తిరుమల కొండపై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల దేవస్థానానికి వెళ్లడానికి రెండు ఘాట్ రోడ్లు ఉండగా.. ఈ రెండు ఘాట్ రోడ్లను రాత్రి 8 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
గాలుల తీవ్రతకు నడకమార్గంతోపాటు కనుమ దారుల్లో పదుల సంఖ్యలో చెట్లు కుప్పకూలాయి. గాలిగోపురం వద్ద చెట్టు పడిపోవడంతో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. భారీగా వీచిన గాలులకు దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలోనూ భారీ వృక్షాలు కూలిపోయాయి. కనుమదారుల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లను తితిదే సిబ్బంది తొలగిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తమిళ నాడు రాష్ట్రాలలో వర్షాలు భారీగా పడుతున్నాయి. దీంతో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి.