సానుకూలంగా ఆలోచించాలి

మేడమ్‌! నా పేరు శిరీష. నా వయసు 40 సంవత్సరాలు. నా భర్త ఈ మధ్య చాలా అనారోగ్యం పాలయినారు. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖం పట్టింది ఆయన వ్యాధి. కానీ నాకు చాలా భయంగా ఉంది. మరల ఆయన తిరిగి జబ్బు పడతారేమోనని ఈ ఆలోచనలతో చాలా దిగులుగా ఉంది. నేను ఈ బాధల నుండి ఈ ఆలోచనల నుండి బయట పడేదెలా? కొంచెం వివరించండి ప్లీజ్‌. – శిరీష

మీరు తప్ప ఈ బాధల నుండి బయటపడగలరు. గతం గురించి చింతించవద్దు. వర్తమానంలో జీవించండి. వర్తమానంలో ఎల్లప్పుడూ ఉండాలి. మనస్సు, హృదయం సంతోషంగా ఉండాలి. చింతలుంచుకోకూడదు. జీవితం విలువ, ఈ రోజు విలువ తెలుసుకోవాలి. బాగున్న వాటిని గురించి సంతోషించాలి. బాగోని వాటి గురించి ఆలోచించవద్దు. సుఖదుఃఖాలు మామూలే. అందరికీ ఉంటాయి. వాటిలో వాటి మాయలో పడి పోవద్దు. ఆనందంగా ఉంటూ సానుకూలంగా ఆలోచించాలి. సానుకూల దృక్పథం ఉంచుకోవాలి. వ్యతిరేకంగా ఆలోచించవద్దు. ఉత్తేజంగా ఉండాలి. మీకిష్టమైన పనులు చేస్తూ ఉండాలి. మంచి కాలక్షేపాలు ఉండాలి. సంతృప్తిగా జీవించాలి. ప్రశాంతత చాలా ముఖ్యం. అవసరాలను మాత్రమే పట్టించుకోవాలి. కోరికలను కాదు. ప్రశాంతత అనేది ఒక హృదయ సంబంధమైన అవసరం. మనస్సుకు ఎన్నో కోరికలు వస్తూనే ఉంటాయి. వాటి గురించి ఇబ్బంది పడవద్దు. ఉల్లాసంగా పనులు, ప్రాధమ్యాలను గ్రహించి చేసుకోవాలి. దైనందిన జీవితం ఎంతో ఉత్సాహంగా ఉత్సవం వలె జరుపుకోవాలి. అప్పుడు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీరు మీ భర్త కూడా చక్కని ఆరోగ్యంతో ఉండగలుగుతారు. ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంటుంది.

మీ అబ్బాయితో స్నేహంగా ఉండండి

మేడమ్‌! నా పేరు శ్రావ్య. నాకు ఒక సమస్య తీవ్రంగా బాధిస్తోంది. నా వయస్సు 50 సంవత్సరాలు. మా అబ్బాయి ఒకడు వివాహానికి సుముఖంగా లేడు. ఇంకో అబ్బాయికి పెళ్లి అయిపోయింది. ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని మొండిపట్టుపడుతున్నాడు. దీనివల్ల నేను, నా భర్త ఎంతో దిగులుగా ఉన్నాము. అందరూ అడుగుతున్నారు. మీ అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకోవటం లేదని. దీనివల్ల మేము ఇద్దరం చాలా చిన్నబుచ్చుకుంటున్నాము. మాకు అన్నీ ఉన్నాయి. మంచి ఉద్యోగం. మంచి హోదాలో ఉన్నాము. పెద్ద ఇల్లు, మంచిగా ఉన్నాము. కానీ ఈ లోటు మమ్మల్ని కుంగదీస్తున్నది. ఏం చేస్తే మా అబ్బాయి పెళ్లి చేసుకొంటాడు? – శ్రావ్య

మీరు తప్పక ఈ సమస్య నుండి బయట పడగలరు. మీరు ముందుగా మీ దృక్పథం సానుకూలంగా మార్చుకోవాలి. సమస్యలన్నీ మన ఆలోచనలలోనే ఉన్నాయి. మనం సమస్య లేదని అనుకుంటే సమస్య కూడా లేకుండా పోతుంది. సమస్య అని అనుకుంటే, ఆ సమస్య తీవ్రమయి పోతుంది. అందువల్ల మీరు ఉన్నవాటిని గ్రహించి, వాటి విలువను గ్రహించి ఆనందంగా ఉండాలి.లేని వాటి గురించి మనస్సు పాడు చేసుకోవద్దు. వివాహం వ్యక్తిగత విషయం. మీ అబ్బాయికి పెళ్లి ఇష్టంలేకపోతే, పెళ్లి చేయవద్దు. అతను పెళ్లికి సంసిద్ధత వ్యక్తం చేస్తే, అప్పుడు అతని పెళ్లి చేయవచ్చు. కానీ ఈ విషయమై మీరు ఏమీ దిగులు చెందకూడదు. జీవితంలో ఎవరి ఇష్టం వారిది. తల్లిదండ్రుల ఇష్టాన్ని పిల్లలపై బలవంతంగా రుద్దకూడదు. అతనిష్టం వచ్చినప్పుడు అతను పెళ్లి చేసుకొంటాడు. మీరు అతనితో స్నేహంగా మెలగండి.
అతని సమస్యలేమైనా ఉంటే వాటిని పరిష్కరించటంలో అతనికి తగు సహాయ సహకారాలు అందించండి. ప్రేమతో, అనుబంధాలతో అతని వ్యక్తిత్వ వికాసానికి మీరు తోడ్పడండి. అన్నింటికీ మించి మీరందరూ ఆనందంగా కలసి మెలసి ఉండండి. జీవితం అత్యంత అమూల్యమైనది. కష్టపెట్టుకోవద్దు. ఆనందంగా ఉండండి.

  • డా. ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com