నా భర్తను హత్య చేసిన వారు చావాల్సిందే

Subodh Kumar Singh wife
Subodh Kumar Singh wife

లక్నో : తన భర్తను చంపినోళ్లకు కూడా అదే గతి పట్టినప్పుడే తన కుటుంబానికి న్యాయం జరిగినట్టు భావిస్తానని బులంద్‌షహర్‌లో జరిగిన హింసాకాండలో మృతి చెందిన యూపీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ భార్య అన్నారు. తన భర్త ఎంతో నిబద్ధతో సేవలు అందించారని పేర్కొన్నారు. సుబోధ్‌పై దాడులు జరగడం ఇదే తొలిసారి కాదని గుర్తు చేసుకున్నారు. గతంలోనూ ఆయనకు రెండుసార్లు బుల్లెట్ గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడెవరూ ఆయనకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను హత్య చేసిన వారు కూడా చనిపోతేనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. అనుమతిలేని కబేళాల్లో గోవధ జరుగుతోందంటూ యూపీలోని బులంద్‌షెహర్‌లో సోమవారం వ్యాపించిన వదంతులు.. రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. బులంద్‌షెహర్‌కు దగ్గర్లోని ఖమహాగ గ్రామానికి సమీప అడవిలో గోవులను చంపిన ఆనవాళ్లు కనిపించాయని, అనుమతి లేకుండా ఎవరో గోవులను వధిస్తున్నారంటూ వదంతులు వచ్చాయి. వాటిని నమ్మిన సమీప గ్రామాల్లోని హిందూ గ్రూపులు, గోరక్షక దళాలు ఆగ్రహంతో ఊగిపోయాయి. అడవిలో కనిపించిన గోవుల శరీరభాగాలను గోరక్షకదళ సభ్యులు ట్రాక్టర్లలో వేసుకుని పట్టణమంతా ర్యాలీ నిర్వహించారు. పలు వాహనాలను దగ్ధం చేసి హింసాకాండకు దిగారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో సుబోధ్‌ కుమార్‌ కూడా ఉన్నారు.