కరోనా వ్యాప్తిపై కెసిఆర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏ దేశం నుంచి వచ్చినా థర్మల్ స్క్రీనింగ్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు

thermal-screening-shamshabad-airport
thermal-screening-shamshabad-airport

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కేసులు భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో ఈవైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కెసిఆర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేశం నుంచి వచ్చినా, నేటి నుంచి విమానాశ్రయంలో దిగే ప్రతి ప్రయాణికుడికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే, వారిని వెంటనే తదుపరి పరీక్షల నిమిత్తం పంపుతామని, ఇందుకోసం ఎయిర్ పోర్టులోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వారు అక్కడి పరీక్షల అనంతరమే బాహ్య ప్రపంచంలోకి వస్తారని అన్నారు. ఇక అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కోవిడ్19 ప్రత్యేక వార్డులను సిద్ధం చేశామని, అన్ని అసుపత్రుల్లో నాలుగు నుంచి పది పడకలు రెడీగా ఉన్నాయని, అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను మరింతగా పెంచేందుకు సైతం చర్యలు చేపట్టామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎంత ఖర్చయినా వెచ్చిస్తామని రెండు రోజుల క్రితం బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. తక్షణం రూ. 100 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు గతవారంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ , మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/