తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత అవసరం

మంచి కోసం కెసిఆర్‌ ముందడుగు వేస్తున్నారు

cm jagan
cm jagan

అమరావతి: ఏపి శాసనసభలో గురువారం గోదావరి జలాల మళ్లింపుపై జరిగిన స్వల్పకాలిక చర్చ వాడి వేడి వాతావరణాన్ని సృష్టించింది. ఈ చర్చకు సిఎం సమాధానమిస్తూ విపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. భావితరాల కోసమే గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు మళ్లించాలనుకుంటున్నామని జగన్‌ స్పష్టం చేరశారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందనుకుంటేనే ముందడుగు వేస్తామని, లేదనుకుంటే ఒక్క అడుగు కూడా వేయబోమని చెప్పారు. గోదావరిలో తెలంగాణ భూభాగం దాటి మనకు 2489 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, మన భూభాగంలోకి శబరి నుంచి వచ్చే నీళ్లు అయిదారు వందల టీఎంసీలే ఉంటాయని వివరించారు. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలోనే ఎగువన తెలంగాణ రాష్ట్రమూ గోదావరిపై చిన్న చిన్న బ్యారేజీలు నిర్మించుకుంటూపోతే ఎలా ఆపగలమని, ఆ తర్వాత మన పరిస్థితి ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ చేపట్టినప్పుడు, ఆలమట్టి ఎత్తును కర్ణాటక పెంచుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వాటిని అడ్డుకోగలిగారా అని నిగ్గదీశారు. అన్ని విషయాలను గమనంలోకి తీసుకుని తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
అయితే తెలంగాణ భూభాగం నుంచి నీళ్లు మన వరకు వస్తాయా అని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన సందేహాలు సహేతుకమైనవేనని, నిజంగా నీళ్లు రావనుకున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఎందుకు ముందడుగు వేస్తామని జగన్‌ ప్రశ్నించారు. ఖతెలంగాణ ప్రభుత్వంతో సఖ్యత ఎంత అవసరమో ఆలోచించుకోవాలి. తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునే గుణం ఉండాలి. కలిసి పని చేసుకునే పరిస్థితి ఉండాలి. ఒకరికి తోడుగా మరొకరు నిలవాలి. కెసిఆర్‌ అంటే నాకు ఎలాంటి ప్రేమ ఉండకపోవచ్చు.ఆయన మంచివాడు. మంచి చేయడానికి ముందడుగు వేస్తున్నాడు. హర్షించాల్సింది పోయి వక్రీకరించడం ఎంతవరకు ధర్మం? అని నిలదీశారు. గోదావరిలో ఏ బేసిన్‌ నుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయి? శ్రీశైలం పరిస్థితి ఏమిటి? గత 5 ఏళ్లలో ఎంతకు పడిపోయాయి?… వంటి అంశాలన్నింటినీ జగన్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/