బయటకు వెళ్లేందుకు భయపడే వ్యక్తిని కాను: ఈటల

నాపై దాడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతోంది: ఈటల రాజేందర్

హైదరాబాద్ : హుజూరాబాద్ ఉపఎన్నికకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శలు పదునెక్కుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన మీద తానే దాడి చేయించుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఈటల మండిపడ్డారు. ఈ నెల 13, 14 తేదీల్లో తనపై తానే దాడిచేయించుకుంటానని టీఆర్ఎస్ మంత్రులు అంటున్నారని… తనపై దాడికి కుట్ర జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చేతకాక, ముఖం చెల్లక, ఓడిపోతాను అనే భయంతో తనపై తానే దాడి చేయించుకుంటాని… ఆ తర్వాత చేతులు, కాళ్లకు కట్లు కట్టుకుని తాను, కన్నీళ్లు పెట్టుకుంటూ తన భార్య ఊరంతా తిరుగుతూ ఓట్లు అడుగుతామని ఓ మంత్రి అన్నారని మండిపడ్డారు. కన్నీళ్లు పెట్టుకోవడం ఈటలకు రాదని అన్నారు. టీఆర్ఎస్ నేతలు చెపుతున్న నీచమైన పనులను ఈటల చేయడని చెప్పారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని, మంత్రిగా పని చేశానని… ప్రస్తుతం తనకు ఒక్క గన్ మెన్ మాత్రమే ఉన్నాడని అన్నారు. బయటకు వెళ్లడానికి భయపడే వ్యక్తిని కాదని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/