కొండగట్టు దేవాలయంలో భారీ దొంగతనం

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న దేవాలయంలో భారీ దొంగతనం జరిగింది. సుమారు 15 కేజీల వెండి , బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. ఆలయ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఆలయానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇక విచారణ పూర్తయ్యే వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భద్రత ఉన్నప్పటికీ దొంగతనం జరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆలయం వెనుక నుండి ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఫుటేజ్ లో తేలింది. ఆ ముగ్గురి చేతిలో కట్టర్లు కనిపించాయి. ప్రస్తుతం పోలీసులు డాగ్ స్క్వాడ్ టీమ్స్ తో దొంగలను పట్టుకొనే పనిలో ఉన్నారు.

చోరీకి గురైన వస్తువులు చూస్తే..స్వామి వారి 2 కేజీల మకర తోరణం , అర్థమండంలోని స్వామి వారి 5 కేజీల వెండి ఫ్రెమ్, 3 కేజీల నాల్గు శఠగోపాలు , స్వామి వారి 5 కేజీల తొడుగు ఇలా మొత్తంగా 15 కేజీల వెండి వరకు చోరీ అయ్యినట్లు ఆలయ అధికారులు చెపుతున్నారు. వీటి విలువ దాదాపు 9 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. కాగా గత వారం రోజుల కిందట సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తాను కృషి చేస్తానంటూ… ఏకంగా 500 కోట్ల నిధులను మంజూరు చేశారు.