లోకమే ఒక గురువు

sun rises
sun rises

నేటికీ ఏడవనాడు సముద్రం పొంగి ద్వారక మునిగిపోతుంది. నేను కూడా భూలోకాన్ని వదలి వైకుంఠానికి వెళ్లెదను అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెబుతాడు. శరణుజొచ్చిన ఈ ఉద్ధవునిపై దయచూపు అని ఉద్ధవుడు వేడుకొంటే శ్రీకృష్ణుడు చెబుతాడు ఇలా ‘ఉద్ధవా! గురువు ఎంత చక్కగా బోధించినా, సాధకుడు తమకు తామే ప్రత్యక్ష అనుభవం వల్లనూ, అనుమాన ప్రమాణం చేతను, గురువు ఉపదేశాన్ని అనుసంధానం చేసుకుంటూ గ్రహించాలి. స్వానుభవానికి మించిన జ్ఞానం మరొకటి ఉండబోదు. లోకమే ఒక గురువు. లోకంలోని చరాచర వస్తువులను పరిశీలించి, గ్రహించదగి దాన్ని గ్రహిస్తూ, గ్రహించరానిది విసర్జిస్తూ క్రమంగా సిద్ధిని సాధించుకోవాలి. మనం ప్రత్యక్షంగా చూసే విషయాల్ని మనస్సుకెక్కించుకుంటే, అందులో నుండి యుక్తాయుక్తాలైన విషయాలు అర్ధమవుతాయి. మరికొన్ని అనుమాన ప్రమాణం చేత కూడా గ్రహించవచ్చు. అదెట్టాగంటే దూరాన పొగ కనిపిస్తుంది. అంటే అక్కడ నిప్పు ఉందని తెలుస్తుంది. నిప్పు లేకుండా పొగరాదు కదా? ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేది గాని, అనుమాన ప్రమాణం చేత తెలుసుకునేది గానీ మనస్సుకు సంబంధించినదే కాబట్టి ఎవరికి వారే తెలుసుకోవచ్చు. వేరొకరు చూసి చెప్పినది ఆత్మ నిశ్చయానికి తోడ్పడదు.
‘ఉద్ధవా! నేను అనే రకాలైన ప్రాణులను సృష్టించాను. అందులో ఒక పాదం గలవి, రెండు పాదాలున్నవి, మూడు పాదాలున్నవి, నాలుగు పాదాలున్నవి, అనేక పాదాలున్నవి అసలు పాదాలే లేనివి ఇట్లా ఎన్నో రకాలైన జీవులున్నవి. వాటన్నింటిలోనూ మనుష్యుల దేహాలంటే నాకు ఎక్కువ ప్రీతి. ఇక్కడ ఈ విధంగా బోధించిన శ్రీకృష్ణుడు భగవద్గీతలో 4వ అధ్యాయం 34వ శ్లోకంలో, ‘ఓ అర్జునా! అట్టి జ్ఞానమును నీవు తత్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసియు, సమయము చూచి వినయంగా ప్రశ్నించియు, సేవచేసియు వారి వలన నెరుగుము. వారు తప్పక నీకుపదేశింపగలరు, అని చెప్పినట్లు ఉండి. జ్ఞానాన్ని ఎలా పొందాలో చెప్పిన శ్రీకృష్ణుడు ఒకచోట ఒక రకంగా మరొక చోట మరొక రకంగా చెప్పి ఉంటాడా? ‘ఉద్ధరేదాత్మనాత్వానం అని చెప్పిన శ్లోకాన్ని శ్రీకృష్ణుడే చెప్పి ఉంటాడంటే ఒప్పుకోవచ్చు. అప్పుడు భగవద్గీతలోని బోధ, భాగవతంలోని బోధ ఒక్కటే అవుతుంది కాబట్టి. ఇక ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఇక్కడ ఒకటుంది. రకరకాల జీవులను సృష్టించిన శ్రీకృష్ణ పరమాత్మకు మనుష్య దేహమంటే ఎక్కువ ప్రీతి అంట. ఒక పాదం, రెండు పాదాలు, మూడు పాదాలు, నాలుగు పాదాలు ఉన్న జీవులు, పాదాలే లేని జీవులు ఎని రకాలో ఉన్నాయి. అన్నిటికంటే మనిషి అంటే నాకు ఎక్కువ ప్రీతి అని శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఎవరో ఒక అజ్ఞాని ఆవు మాంసం తిన్నాడని వానిని నిజమైన కృష్ణభక్తులు చంపవచ్చా? అలాంటి వానికి నేను హిందువును, నేను కృష్ణభక్తుడను అని చెప్పే నైతిక హక్కు ఉందా?

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/