కరోనాతో కొత్త అసాధారణ జీవితం ఆరంభం

జీనవశైలిలో మార్పులు

Covid-19-Effect-
Covid-19-Effect-

మానవ చరిత్రలో ఇదో నూతన అధ్యాయం. కంటికి కనిపించని జీవితో ట్రావెల్‌ చేయాల్సిన సందర్భం రానే వచ్చిం ది. ఇప్పటివరకు జీవితం వేరు. ఈ రోజు నుంచి జీవితంవేరు.

ఇకనుంచి మన జీవితం ఎలా ఉంటుంది? మన జర్నీ మరీ డేంజర్‌గా ఉండబో తోందా? గుండెల్లో గునపం దింపా లని చూస్తొన్న కొత్త శత్రువ్ఞని ఎలా ఎదుర్కోవాలి?

నిరంతరం నిలిచి గెలవాలంటే మనమేం చేయాలి? దాక్కుంటే దారుణ పరి స్థితులు.’దారికి వస్తే దడ పుట్టించే వైరస్‌.ఇదో నిరంతర యుద్ధం.

నిలిచి గెలవాల్సిన సమరం. కరోనా వైరస్‌తో మానవాళికి దాపు రించిన దుస్థితి ఇది. మన జీవన గమనంలో కరోనాకు ముందు, కరోనా తర్వాత అని స్పష్టమైన తేడా స్పష్టమవుతోన్న సందర్భ మిది.

కనుక సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన అంశాలను రూపొందించుకుని ముందుకెళ్లడమనేది ప్రస్తుత పరిస్థితులలో అనివార్యమవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన తరుణమిది. మానవాళిని ప్రమాదపు టంచులకు చేర్చిన కరోనా వైరస్‌ కారణంగా అంతకుముందున్న స్వేచ్ఛాయుత వాతావరణం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు.

ప్రతి అడుగూ అత్యంత జాగ్రత్తగా, స్వీయ నియంత్రణతోనే వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ దుర్భర పరిస్థితుల్లో కరోనా తదనంతర జీవితమేమిటనే విషయమై సర్వత్రా ఆందోళన నెలకొంది.

ఈ మహమ్మారిని నియంత్రించే టీకా వచ్చేంతవరకు ఆ విషక్రీమితో కలిసి జీవించక తప్పని పరిస్థితి ఉత్పన్నమైంది.

జీవి తాన్ని పునర్నిర్వచించుకుని ప్రాచీన సంప్రదాయ జీవన విధానాన్ని అలవర్చుకునే దిశగా మన ఆలోచనలను మార్చుకోవాల్సి ఉన్నది. ఇది పెద్దకష్టమైన పనేంకాదు. 75 రోజుల లాక్‌డౌన్‌ తర్వత అన్‌లాక్‌ 1.0 కార్యరూపంలోకి వచ్చింది.

అధికారికంగా లాక్‌డౌన్‌ 5.0గా పిలిచుకునే తాజా నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీనితో ఆర్థిక వ్యవస్థ, సాధారణ జనజీవనం నియంత్రిత పద్ధతిలో దశలవారీగా తిరిగి మామూలు స్థితికి చేరుకుంటున్నది.

ఇది కొత్త అసాధారణ స్థితికి ఆరంభం.మనం కరోనా వైరస్‌తో కలసి సహ జీవనం చేయడం నేర్చుకోవాలని ప్రభుత్వంతోపాటు నిపుణులు, అధికారులు తేల్చి చెప్పేశారు.వ్

యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందో తెలి యదు. అందువల్ల మనం కొత్త అసాధారణ పరిస్థితులలో గడ పాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని తలకిం దులు చేసింది.

అందరి జీవితాలను మార్చివేసింది. లాక్‌డౌన్‌ వల్ల ప్రజల జీవన విధానంలో ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకు న్నాయి. మాస్క్‌లు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికి వెళ్లినా వెంట శానిటైజర్‌ తీసుకొని వెళ్లాల్సి వస్తోంది.

భౌతిక దూరం పాటించనిదే ఏ పని జరగడం లేదు. అంతేకాదు ఎవరితో మాట్లాడాలన్నా ఎవరినైనా కలవాలన్నా భయమే. లాక్‌ డౌన్‌ తర్వాత పరిస్థితి పూర్తిగా వేరు. కరోనా అనంతర జీవనంపై ‘ప్యూ పరిశోధనా కేంద్రం చేసిన ఓ సర్వేలో ఊహించని విశేషాలు వెల్లడయ్యాయి.

91 శాతం మంది అమెరికన్లు కరోనా తమ జీవితా లను పూర్తిగా మార్చేసిందని భావిస్తున్నారు. 88 శాతం మంది ఈ వైరస్‌ అంతమైపోవాలని ప్రార్థనలు చేశారు.

77 శాతం మంది ఇకపై రెస్టారెంట్లలో భోజనం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అమెరికా ఎన్నికల్లో వరుసలో నిలబడి ఓటు వేయడం సరికాదేమో నని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు.

కంటికి కనిపించని ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా మానవాళిపై చూపించిన పెను ప్రభావ మిది.

భారతదేశవ్యాప్తంగా 500 కరోనా కేసులు నమోదైన సమ యంలోప్రధాన మంత్రి మోడీ ఇచ్చిన పిలుపుతో మార్చి25 నుంచి దేశం లోని 130 కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మా రిని తరిమేసేందుకు స్వీయ నిర్బంధాన్ని విధించుకున్నారు.

వైద్య నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కరోనాతో పోరాటాన్ని సుదీర్ఘకాలం కొన సాగించకతప్పదని స్పష్టం చేశారు.

అంతా అనుకుంటున్నట్లుగా జరిగినా, నడుస్తున్న పరిశోధనలు వెంటనే సత్ఫలితాలిచ్చినా టీకా వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందనేది మనమంతా అంగీకరించాల్సిన విషయం.

ఈ పరిస్థితుల్లో ప్రజలు వాస్తవ పరిస్థితులను అంగీకరిస్తూ రేపటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది.

దేశ ఆర్థికస్థితిని పునరుజ్జీవింపచేస్తూనే ప్రజల జీవితాలకు భద్రత కల్పించడం ఓ ముఖ్యమైన సవాల్‌.

ఈ నేపథ్యంలో జన జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే క్రమంలో ఎక్కువమంది పనిచేసే చోట భద్రతా ప్రమాణాలు పాటిస్తూనే పరిశ్రమలు, ఇతర ఆర్థికపరమైన కార్యక్ర మాలను తిరిగి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.

ఇందుకోసం కఠినమైన నిబంధనలను రూపొందించి వాటిని తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలి.

లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు తక్కువ సమయంలోనే ఉత్పత్తిని ఒకేసారి పెంచేయాలని అనుకోవడం కంటే ఓ క్రమపద్ధతిలో ముందుకెళ్లడం అత్యంత ప్రధానం.

మరోవైపు ఈ అనిశ్చితి కారణంగా భారీ సంఖ్యలో వలస కార్మికులు స్వస్థలాలకు పయనమవ్ఞతున్నారు.

అక్కడ కూడా ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరకని పరిస్థితి. ఇది సమీపభవిష్యత్తులో వారికి మరిన్ని ఇబ్బందులను తీసుకొస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో వారిని తిరిగి పనుల్లోకి తీసుకురావడంతో పాటు వారికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా భద్రత కల్పించే కార్యక్ర మాలు చేపట్టాల్సిన అవసరముంది.

కరోనా మహమ్మారి విస్తరి స్తున్న సందర్భంలో ఒకరి అనారోగ్య పరిస్థితి మరొకరిపై ప్రభావం చూపే అవకాశాలున్న నేపథ్యంలో మన ప్రవర్తన, మన ఆలోచన అత్యంత కీలకం కానున్నాయి.

సురక్షిత దూరాన్ని పాటిస్తూనే అనుసంధానత, పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసర ముంది. ఇది కరోనా తదనంతర పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా మనం పనిచేసే చోట పాటించాల్సిన అత్యంత కీలకమైన సూచన.

సురక్షిత దూరాన్ని పాటించడం, మాస్క్‌లు ధరించడం, తరుచూ చేతులు కడుక్కోవడం వంటి వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకునే జాగ్రత్తలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాల్సిన అవసర ముంది.

ఇప్పటికే ఆన్‌లైన్‌ సమావేశాలు, సదస్సులు నిర్వహించు కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.ఆరోగ్యకరమైన డిజిటల్‌ జీవితాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం కనబడుతోంది.

ఇన్నా ళ్లుగా మనం జీవితం కొనసాగిన దానికి భిన్నంగా కొత్త అలవాట్ల ను నేర్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే. కరోనా నేపథ్యంలో మనం ఒక కీలకమైన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. మన జీవనం వేరు, మన జీవన విధానం వేరు.

గత ఐదుదశా బ్దాల్లో మన జీవనంలో, జీవనశైలిలో వచ్చిన మార్పులను సమీక్షిం చుకోవాలి. అంతకుముందున్న మన సంప్రదాయ పద్ధతులను అర్థంచేసుకుని, ఆ పద్ధతులను మళ్లీ మన జీవనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.

జీవనానికి, జీవనశైలికి మధ్య సమతుల్యతను పాటించాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను బట్టి అది వీలైనంత త్వరగా కార్యరూపం దాలు స్తుంది. అనిశ్చిత పరిస్థితులకు వెంటనే స్పందించకూడదు.

శాస్త్ర సాంకేతికత పరిజ్ఞానం ద్వారా విశ్వసనీయమైన,హేతుబద్ధ మార్గం లోనే ఆలోచించాలి.

భయాన్ని వదిలి, ఆత్మవిశ్వాసంతో జీవించే పరిస్థితిని అలవాటు చేసుకోవాలి. మనిషి ప్రకృతిని కాపాడుకోవాలి. స్వచ్ఛమైన గాలిని, నీటిని కాపాడుకోవాలి.

లేకుంటే కొంత కాలానికి మరో కరోనా కనిపించే రూపమెత్తి ఏదీ మిగల్చకుండా మహా విధ్వంసం చేయవచ్చు. లాక్‌డౌన్‌ సడలింపు, పొడిగింపు, ముగింపు మనం పాటించే స్వీయనియంత్రణలోనే ఉన్నది.

-ముద్దం నరసింహ స్వామి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/