భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

నోబెల్ ను రెండు భాగాలుగా పంచిన స్వీడిష్ అకాడెమీ

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
Nobel Prize in Physics Awarded to 3 Scientists

స్టాక్‌హోం: ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వివిధ రంగాల్లో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ లు ప్రకటించగా.. ఈ సంవత్సరం భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ ను రోజర్ పెన్రోజ్, రీయిన్ హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్ గెలుచుకున్నారు. అయితే, ఈ ప్రైజులో సగం రోజర్ పెన్రోజ్ కు, మిగతా సగం గెంజెల్, గెజ్ లకు సంయుక్తంగా ఇస్తున్నామని ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విశ్వంలో కృష్ణబిలం ఏర్పడడం అనేది ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని నిరూపించే క్రమంలో ఓ బలమైన అంచనాగా నిలుస్తుందని రోజర్ పెన్రోజ్ తన పరిశోధన ద్వారా విడమర్చారు. రోజర్ పెన్రోజ్ బ్రిటన్ లోని ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన 1931లో బ్రిటన్ లోని కోల్ చెస్టర్ లో జన్మించారు. ఇక, నక్షత్రమండలం కేంద్ర బిందువు ఓ అతిభారీ ద్రవ్యరాశేనని రీయిన్ హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్ లు తమ పరిశోధన ద్వారా గుర్తించారు. జర్మనీకి చెందిన రీయిన్ హార్డ్ గెంజెల్ మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ లో గ్రహాంతర భౌతికశాస్త్ర విభాగం డైరెక్టర్ గానూ, అమెరికాలోని బర్క్ లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గానూ వ్యవహరిస్తున్నారు. ఇక ఆండ్రియా గెజ్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ లో ప్రొఫెసర్.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/