గది వెచ్చగా …

Indoor

కొన్ని ఇళ్లులో చాలా చల్లగా ఉంటుంది. ఇల్లంతా వెచ్చగా చేసేందుకు వేరే ఏర్పాట్లు ఉన్నా, ఒక గదిని వెచ్చగా ఉంచుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవచ్చు. కాస్త చలిగా అనిపిస్తే వెంటనే స్వెటర్‌ వేసుకునన్నట్లుగానే మరి ఇంటిని వెచ్చగా ఉంచాలంటే ఏం చేయాలో తెలియాలిగా మరందుకు ఏం చేయాలో చూద్దామా.

ఈ కాలంలో సాయంత్రం నాలుగు కాగానే కిటికీలఉ మూసేయడం మంచిది. అలాగే కిటికీ తలుపుల మధ్య చిన్న ఖాళీలున్నా కూడా చల్లగాలి లోపలికి వస్తుంది. అలా కూడా గది వాతావరణం చల్లబడిపోతుంది. కాబట్టి అలా ఖాళీలున్న చోట దళసరి టేప్‌ను అంటిస్తే సరిపోతుంది. చలికాలంలో సాధారణంగా మందంగా ఉన్న పరదాలు వేలాడదీయాలంటారు. బదులుగా కిటికీలకు, గుమ్మాలకు సిల్క్‌ పరదాలు వాడాలి. అవి వేడిని త్వరగా గ్రహిస్తాయి.

పగటిపూట సూర్యరశ్మి వచ్చే వేళల్లో కిటికీలను తెరిచి ఉంచి, సాయంత్రాలు కిటికీలు మూసేయాలి. అప్పుడే గది వాతావరణం వేడిగా ఉంటుంది. పడకగదిలో కార్పెట్‌ లేకపోతే రాత్రి సమయాల్లో పాత రగ్గులను నేలపై పరవాలి. దాంతో గదిలో చల్లదనం ఉన్నా రంగ్గు వల్ల అంతగా చలి అనిపించదు. ముఖ్యంగా నడిచేటప్పుడు పాదాలకు చల్లదనం ఉండదు.
చిన్నపిల్లలున్న ఇంట్లో అయితే పెద్ద గిన్నెలో నీళ్లు వేడిచేసి దాన్ని గదిలో ఓ మూల ఉంచవచ్చు. కావాలనుకుంటే అందులో నాలుగు చుక్కల యూకలిప్టస్‌ నూనె వేస్తే ఆ వాసన జలుబు బారి నుంచి కాపాడుతుంది. గది కూడా వెచ్చగా అనిపిస్తుంది. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే.