మనసు శుద్ధితోనే ఆత్మజ్ఞానోదయం

మనసు శుద్ధితోనే ఆత్మజ్ఞానోదయం
The mind is pure self-consciousness

ఆధ్యాత్మ సాధన మానవ జీవితాలకు సుఖశాంతులను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మ భావన దైవభావనయే. ఈ భావన స్థిరపడాలంటే సాధన ముఖ్యం. ఈ సాధన ప్రారంభానికి పలు విషయాలను సాధకులు తెలుసుకుని మసలాలి. లేకపోతే చెడు మార్గంలో పడిపోతారు. ఈ సాధనను పెద్దలైన మహనీయుల వలన అనుభవజ్ఞులైన గురువ్ఞల వలన ముఖ్యపద్ధతులను తెలుసుకోవాలి.
ఆధ్యాత్మిక సాధనకు ఇంద్రియ నిగ్రహం ఎంతో ఆవశ్యకమైనది. ఈ సూత్రాన్ని గమనించి మసలుకోవాలి. దీనిలోతుపాతులను తెలిసికొనలేకపోతే ఇంద్రియాలను అణచి లోపలి మనస్సుతో లోక వ్యవహారాలను, విషయభోగాలను చేయుచుండుట జరుగుతుంది. ఈ విషయాన్నే భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునునికి కర్మయోగంలో ఆరవశ్లోకంలో ఇలా తెలిపారు.
శ్లోII కర్మేంద్రియాణి సంయమ్య-య ఆస్తే మనసా స్మరన్‌
ఇంద్రియార్థాన్‌విమూఢాత్మా-మిథ్యాచారస్య ఉచ్చతేII అనగా ఎవడు కర్మేంద్రియాలు-జ్ఞానేంద్రియాలను అణచి మనస్సు చేత ఇంద్రియాల శబ్దాది విషయాలను ఆలోచిస్తూ ఉంటాడో అట్టివాడు మూఢచిత్తుడుగా ఉంటాడు. కపటమైన ఆచరణ గలవాడనీ తెలిపారు. సాధకులు ఈ డంబాలకు తావివ్వరాదు. ఇలాంటి డంబాలు చేసే వారిని మిథ్యాచారులంటారు. ఉత్తమ సంయమము గలవాడు మిథ్యాచారిగా వేరడు, ధ్యానమందును మనస్సును దైవముపై నిలుపక కొందరు సాధకులు పలుదారులలో పయనిస్తూ ఉంటారు. పరమార్థ-పరమాత్మ తత్త్వాన్ని మరచిపోతుంటారు. ముముక్షువ్ఞలైన వారు తమ మనస్సులను విషయములపై పరుగెత్తిననూ, దాని నుండి మరల్చి ఆత్మయందు అనగా దైవము నందు నిల్పుటకు సాధన చేస్తారు. మిథ్యాచారం గలవారు అలా చేయలేరు. సాధన ఆచరించే వారిది సదుద్దేశ్యం. మిథ్యాచారులది దురుద్దేశ్యం. కృత్రిమ ధ్యానం.
లోకంలో యోగులవలె నటించే అజ్ఞానులుండవచ్చును. వారి మనస్సులు వాసనామయమై అనగా సాంసారిక విషయాలలో ప్రవర్తించుచుండుటచే ముల్లోకాలలో తిరుగుతూ ఉంటుంది. వారికి ప్రపంచ సుఖముగానీ, దైవ సుఖముగానీ ఉండవ్ఞ. రెండింటికీ చెడిన వారగుదురు. పరమ్మాత ఇట్టి వారిని విమూఢులన్నారు. ఇంద్రియాలకు స్వతహాగా విషయాలు అనుభవించే శక్తిగానీ, తెలుసుకొను శక్తిగానీ ఉండదు. మనస్సు వాటితో చేరినపుడే నియత శక్తులేర్పడతాయి. కావ్ఞన మనస్సుతో బాటు ఇంద్రియ నిగ్రహం కలిగినపుడే ప్రయోజనం సిద్ధిస్తుంది. కేవలం ఇంద్రియాలను నిగ్రహిస్తే సరిపోదు. విజ్ఞులైనవారు ఆ ప్రవర్తనను వదలిపెట్టాలి. మనస్సును కూడా నిగ్రహించాలి. అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే సాధన సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రయోజనం సిద్ధిస్తుంది.
ఆధ్యాత్మ సాధనలో ఫలాపేక్ష రహితముగా కర్మలు చేయాలి. ఇంద్రియాలు చేసే పనులకు మనస్సు సంగమమే బంధనకారణం. అసంగమమే మోక్షకారణం. కావ్ఞన అట్టి సంగము, విషయవాసన మనస్సు నుండి తొలగించి పిదప ఇంద్రియాలతో పనులు చేసినచో దోషం కల్గదని భగవానుడు గీతలో బోధించాడు. లోకహితార్థమే కర్మలు చేయాలి. అసక్త బుద్ధితో సాధకులు దైవభావనతో కర్మయోగాన్ని పరిశీలించాలి. ఆచరించాలి. శాస్త్ర నియతములగు కర్మలనే ఆచరిస్తూ ఉండాలి. అదే ఆధ్మాత్మిక సాధన. కర్మలు మానరాదు. కర్మలు చేయకుంటే చిత్తశుద్ధి కల్గదు. జ్ఞానం అంకురించదు. జ్ఞానం లేకుంటే మోక్షం అనగా పరమపదం సిద్ధించదు. దేహయాత్ర సక్రమంగా కొనసాగదు. అందుకే పరమాత్మ ఒక శ్లోకంలో ”నియతం కురు కర్మత్వం-కర్మజ్యాయోహ్యకర్మణః అన్నారు. ఆధ్యాత్మ సాధకులు నియత కర్మలచే మనస్సును శుద్ధి పరచుకుంటే ఆత్మజ్ఞానోదయం కల్గుతుంది.
సత్కర్మలు దైవార్పిత కర్మలుగా ఉంటే సాధకులకు ఎంతో మేలు శ్రేష్టము. కర్మలచే జనులు బంధింపబడుదురుగాన సంగరహితులై కర్మలనాచరించాలి. ఆధ్యాత్మిక సాధనను ఒక యజ్ఞంగా భావించాలి సాధకులు.
సకామముగా ఫలాసక్తితో చేయబడు కర్మలనాచరించక భగవద్విషయమైన కర్మలనే చేసుకుంటూ చిత్తశుద్ధిని బొంది, మోక్షప్రాప్తికి తమ మార్గాలను సులభరీతిలో మలచుకోవాలి. సత్కార్యాలు, దైవకార్యాలనే యజ్ఞాలని పేర్కొన్నారు. ఇవి జీవ్ఞలకు ఆధ్యాత్మికాభివృద్ధినీ, శాంతిసౌఖ్యాలను, మోక్షాన్ని అందజేస్తాయి. దుఃఖరాహిత్యము పరమానంద ప్రాప్తి ఈ ఆధ్యాత్మిక యజ్ఞముల ద్వారా సాధకులు పొందగలరు. ఈ సాధనలే జీవ్ఞని నైతి క ఆధ్యాత్మికాభివృద్ధిని కలుగజేస్తాయని గీతలో పరమాత్మ చక్క ని సందేశాన్ని అందించారు.సకలప్రాణి కోటి ఆధ్యాత్మ సాధనలో కృతకృత్యులు కావాలనీ భగవానుడు బోధించాడు. భగవంతుడు కరుణామయుడు గదా! జీవి ప్రతి సాధనకూ తన వంతు సాయాన్ని అందిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. జీవ్ఞలు తరించు టకు ఇంకేమి కావాలి దైవానుగ్రహం ఆశీస్సులు తప్ప.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/