శ్రీ వాసవీ కన్యకా దేవి పురాణము

Vasavi maata
Vasavi maata

మనం ధర్మనందనుని గురించి విన్నాం. ఆయన మహాభారతంలోని ధర్మనందనుడు, పాండవాగ్రజుడైన ధర్మరాజు. మరొక ధర్మనందనుడున్నాడు. ఆయన శ్రీవాసవీ కన్యకా దేవి పురాణములో మనకు దర్శనమిస్తాడు ఆర్యావర్తములో శ్రేష్టమైన ప్రతిష్టానగరము అను మహానగరముండేది. అందులో చూడామణి అను వైశ్యుడుండేవాడు. అతడు జ్ఞానవంతుడు, గుణవంతుడు, శీలవంతుడు, సత్యసంధుడు, నిత్య దాన ధర్మాది సద్గుణ నిబద్ధుడు, ధర్మనిరతిచే ‘ధర్మశ్రేష్టి అను పేరును పొందాడు. ‘ఆర్యక అతని భార్య. వారికి చాలాకాలముసంతానము కలుగలేదు. వారు చ్యవన మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆయన్ను కలిసి వారి సమస్యను విన్నవించారు. ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేయమన్నాడు. చ్యవనమహర్షి అలాగే చేశారు ఆ దంపతులు. పరమేశ్వరి సాక్షాత్కరించి వారికి పుత్రుడు జన్మిస్తాడని వరము ఇచ్చింది. ఆ వరప్రభావం వల్ల వారికి కుమారుడు జన్మించాడు. అతనే ధర్మనందనుడు. అతనికి ఎనిమిదేండ్ల ప్రాయము వచ్చిన వెంటనే అతని తండ్రి చూశామణి అతనికి ఉపనయన సంస్కారాలు జరిపించాడు. గురుకులానికి పంపాడు.

అతనికి చ్యవన మహర్షి అన్ని విద్యలను నేర్పాడు. మంచి నడవడిక నేర్పాడు. ఒకనాడు ధర్మనందనుడు పుష్పాలను తెచ్చుటకు వనానికి వెళ్లాడు. ఒక ఆర్తనాదము వినపడింది. ‘ ఓ వ్యాధుడా! తీర్థయాత్రాసక్తుడనైన అంగీరసుడను బ్రాహ్మణుడను. సాధుజీవనుడను. నన్ను హింసింపకు విడిచిపెట్టు అను మాటలను ధర్మనందనుడు విన్నాడు. అటువైపు వెళ్లి చూస్తే ఒక కిరాత కాపాలికుడు కనపడ్డాడు. ధర్మనందనుడు వానితో ‘ఓరీ పాపాత్ముడా! సాధు జీవనుడు, పూజ్యుడైన బ్రాహ్మణుని ఏల హింసించుచున్నావు? అని అడిగాడు. వ్యాధులు అతనితో ‘ఓ బాలకా! నేను ప్రతి సంవత్సరము ఈ వింధ్యగిరిలో నెలకొని ఉన్న శక్తికి ఒక పురుషుని బలిగా అర్పించవలసి ఉన్నది. ఇది మా వంశాచారము. ఇది నా అవశ్య కర్తవ్యము అని బదులు చెప్పాడు. ధర్మనందనుడు వానితో ‘వ్యాధుడా! నీవు బ్రాహ్మణునికి బదులుగా నన్ను శక్తికి బలి ఇమ్ము.

నీ శ్రేయస్సును సంపాదించుకో అన్నాడు. ఆ వ్యాధుడు వెంటనే బ్రాహ్మణుని విడిచి ధర్మనందనుని బంధించి ఈడ్చుకుని పోయాడు. పరోపకార్ధార మిదం శరీరం అని మనసా వాచా కర్మణా నమ్మినవాడు ఈ ధర్మనందనుడు. మరి అలాంటి వానికి దుర్గతి కలిగి ఉంటుందా? ఉండదుగాక ఉండదు. ఆ వ్యాధుడు అతనిని ఒక గుహలో వదలి వెళ్లాడు.

భద్రుడను మగధ దేశాధిపతి సేనకు ఆ వ్యాధుడు చిక్కాడు. వారు అతనిని చంపారు. శంకరుని కంఠహారమగు వాసుకి గుహలోని ధర్మనందనుని వద్దకు వచ్చి అతనిని పాతాళలోకములో ఉన్న ఆదిశేషుని వద్దకు తీసుకెళ్లింది. ఆదిశేషుడు అతనికి సృష్టి క్రమమును, వర్ణోత్పత్తిని గురించి, కాలాన్ని గురించి, దేవీతత్వాన్ని గురించి ఎన్నెన్నో విషయాలు చెప్పాడు. ఆదిశేషుని ఆశీర్వాదాలను పొంది ధర్మనందనుడు క్షేమంగా తల్లిదండ్రులను, గురుదేవుడైన చ్యవన మహర్షిని కలుసుకొన్నాడు. పరోపకార ఫలితం జ్ఞానార్జన, సుఖసంతోషాలు అని ధర్మనందనుని జీవితం బోధిస్తుంది. నీతిని గ్రహించి ఆచరిద్దాం
– రాచమడుగు శ్రీనివాసులు

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/