మానవ సేవయే మాధవ సేవ

ఆధ్యాత్మిక చింతన

Lord Sri Krishna
Lord Sri Krishna

యుద్ధం చేస్తే బంధుమిత్రాదులు ఛస్తారని, కుల ధర్మాలు నశిస్తాయని, జరుగరాని వెన్నో జరిగిపోతాయని శోకం చేత వ్యాకులమైన మనసుతో విల్లంబులను వదిలివేసి రథంలో కూలబడిపోయిన అర్జునునకు శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత 18వ అధ్యాయంలోని 66వ శ్లోకం ఇది

సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష యిష్వామి మా శుచః
అర్ధము – సర్వ ధర్మాలను పరిత్యజించి, ఉన్న నన్నొకనిని శరణుచెందుము. నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తాను. శోకించవద్దు.

వ్యాకుల చిత్తంతో శోకిస్తుండిన అర్జుననకే కాదు, మిక్కిలి వ్యాకులుడై ఉండిన బ్రహ్మకు కూడా శ్రీకృష్ణుడు ఒకప్పుడు ఇలాంటి బోధనే చేసి నట్లు ‘శ్రీ బ్రహ్మ సంహిత ద్వారా మనకు తెలుస్తుంది బ్రహ్మసంహిత ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథము.

అందులో నూరు అధ్యాయాలున్నాయట. ఈ గ్రంథంలోని 5వ అధ్యాయము శ్రీచైతన్య మహా ప్రభువ్ఞనకు దక్షిణ భారతదేశమున తమిళనాడు రాష్ట్రమునందలి తిరువత్తూరు గ్రామమున గల ఆదికేశవ మందిరమున లభించెను. శ్రీకృష్ణుడు మిక్కిలి వ్యాకులుడైన బ్రహ్మకు పంచశ్లోక భక్తి విజ్ఞానము బోధించాడు. అందులో ఒక శ్లోకము ఇది

ధర్మనన్యాన్‌ పరిత్యజ్య మామేకం భజ విశ్వసన్‌
యా దృశీ యాదృశీ శ్రద్ధా సిద్ధిర్భవతి తాదృశీ
కుర్వన్నిరంతరం కర్మ లోకో యమనువర్తతే
తేనైవ కర్మణా ధ్యాయన్‌ మాం పరాం భక్తి మిచ్ఛతి


ఈ శ్లోకానికి భక్తి సిద్ధాంత సరస్వతీ గోస్వామి వారు ఇచ్చిన వ్యాఖ్యానము గమనింపదగ్గది. జీవ్ఞందరికినీ విశుద్ధ భక్తి సాధనయే పరమధర్మము. తదితరములన్నియు లౌకిక జీవన కర్మలే. ఇట్టి ధర్మములు పెక్కు గలవ్ఞ.

ఉదాహరణకు – నిర్వాణప్రాప్తికై బ్రహ్మజ్ఞాన ధర్మము, కైవల్య సిద్ధికై అష్టాంగ యోగధర్మము, ఐహిక సుఖప్రాప్తికై బహిర్ముఖ కర్మకాండ రూపధర్మము, జ్ఞానమునకు సంబంధించిన వైదిక కామ్య కర్మరూపజ్ఞాన యోగ ధర్మమును అవలంభించి, నన్ను భజింపుము. శ్రీకృష్ణుని భజిస్తూ కూర్చుంటే ఇక ఏ ఇతర కర్మను చేయకుండా ఊరకే ఉండాలా? అది సాధ్యమా? మనుగడ సాగుతుందా? శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ‘

ఈ జగత్తున జనులు నిరంతరము ఏదేని ఆదర్శసాధనకై కర్మలో నిమగ్నులగుదురు. ఆ కర్మలన్నింటిని చేయుచువారు నన్ను ధ్యానించుచు, నా సేవా రూప పరాభక్తిని పొందుదురు. అంటే మనం దానం చేస్తున్నా, సేవ చేస్తున్నా ఎదుటి వానిని శ్రీకృష్ణునిగనే భావిస్తూ చేయాలి.

అందుకే ‘మానవసేవే మాధవసేవ అని ‘జనసేవయే జనార్ధనసేవ అని చెప్పేది. శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన బోధ, బ్రహ్మదేవ్ఞనకు చేసిన బోధ నిజానికి మన అందరికీ చేసిన బోధ అని మనం గ్రహించాలి. మనం ఏ కర్మము చేస్తున్నా నిరంతరం భగవంతుడిని స్మరిస్తూనే ఉండాలి. కర్మఫలితాన్ని ఆయనకే వదలి వేయాలి.

అప్పుడు మన జీవితం ఎంత శ్రమతో కూడుకొన్నదైనా ఆ శ్రమ మనకు శ్రమలాగా కనపడదు, పూజలాగా కనపడుతుంది, సంతృప్తినిస్తుంది. సంఘమే దేవాలయమవ్ఞతుంది, ప్రతి చెట్టు, పుట్ట, గుట్ట, క్రిమి, కీటకం శ్రీకృష్ణుని దివ్యరూపమై అలరారుతుంది. యావత్‌ సృష్టి కృష్ణమయమవుతుంది.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/