భగవద్గీత

ఆధ్యాత్మిక చింతన

The Bhagavad Gita
The Bhagavad Gita
  • ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్‌
  • వివస్వాన్మనవే ప్రాహమను రిక్ష్వాకవే భ్రవీత్‌
  • ఏవం పరమ్పరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః
  • స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప

ఈ రెండూ భగవద్గీతలోని నాలుగవ అధ్యాయంలోని మొదటి రెండు శ్లోకాలు. వాటి అర్థము: నాశ రహితమైన ఈ కర్మ యోగాన్ని నేను వివస్వతునికి చెప్పాను.

వివస్వతుడు మనువుకు, మనువు ఇక్ష్వాకువుకు చెప్పారు. ఇది మొదటి శ్లోకానికి అర్థము.

ఇక రెండవదాని అర్థము: ఈ విధంగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగం రాజర్షులకు తెలిసి ఉండినది. చాలా కాలం గడిచిన కారణంగా ఈ యోగం నష్టమైంది.

దీన్ని చదివినప్పుడు ఒక ప్రశ్న తల ఎత్తుతుంది. ఈ కర్మ యోగాన్ని మనువు ఇక్ష్వాకునకు బోధించెను. ఇక్ష్వాకు మరెవరో మనిషికి బోధించెను. అంటే మనం అర్థం చేసుకోవచ్చు.

కానీ భగవానుడు వివస్వతునికి(సూర్యుడు) బోధించెను అనుదానిని, సూర్యుడు మనువుకు బోధించెను అనుదానిని ఎలా అర్థం చేసుకోవాలి? సూర్యుడు ఒక అగ్నిగోళం.

మనం నేడు దాన్ని చూస్తున్నాం. ఒకవేళ అది భౌతిక రూపమే, దానికి మరొక సూక్ష్మ రూపముంటుంది,

భగవానుడు దానికి బోధించి ఉంటాడనుకొన్నా ఆ బోధ ఏ రూపంలో, ఏ భాషలో ఉండి ఉంటుందన్న ప్రశ్న కలగాలి. దానికి సరైన వివరణ శంకర భాష్యంలో లేదు,

గీతా మకరందంలో లేదు, శ్రీమద్భగవద్గీత-తత్త్వ వివేచనలో లేదు.

మనం సొంతంగా ఆలోచిస్తే ఆ బోధ ఈ శ్లోకాల రూపంలో కాక ఏదో మరొక రూపంలో ఉండి ఉంటుందని తోస్తుంది.

సరే.. అలా మనువుకు, మనువు నుంచి ఇక్ష్వాకుకు, అతని నుంచి ఇతర రాజులకు పరంపరాగతంగా వచ్చింది అని అన్నారు కాబట్టి ఆ జ్ఞానం క్షత్రియులకే ఉండింది,

బ్రాహ్మణులకు ఉండలేదు అని అర్థమవుతుంది. బ్రాహ్మణులు ఎప్పుడూ కామ్య కర్మలనే ప్రోత్సహించినట్టు, క్షత్రియులు నిష్కామ కర్మను అనుసరించినట్టు తెలుస్తుంది.

కాలక్రమేణ కర్మయోగ జ్ఞానం నష్టమైందని శ్రీకృష్ణుడు చెప్పాడు. మనకు శ్రీమద్రామాయణంలో సూర్యవంశ రాజుల వివరాలు లభిస్తాయి.

”బ్రహ్మదేవుని నుండి మరీచి పుట్టాడు. మరీచికి కాశ్యపుడు జన్మించాడు. కాశ్యపునకు సూర్యుడు పుట్టాడు.

సూర్యుని కుమారుడు మనువు. మనువుకు ఇక్ష్వాకు జన్మిం చాడు. ఇక్ష్వాకు అయోధ్యకు మొట్టమొదటి రాజు. ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షుడు. వికుక్షి పుత్రుడు బాణుడు. బాణుని కుమారుడు అనరణ్యుడు.

అనరణ్యునకు పృథువు జన్మించాడు.. (పుట 84, శ్రీమద్రామాయణము-రామకృష్ణ మఠం). అలా లవ కుశుల వరకున్న రాజుల వివరాలు తెలుస్తాయి.

వారిలో మాంధాత, భరతుడు, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, రఘువు, అంబరీషుడు, నహషుడు, యయాతి మొదలైన ప్రముఖులెందరో వున్నట్టు తెలుస్తుంది.

ఇక శ్రీకృష్ణావతారానికి ముందే శ్రీరామచంద్రుడున్నట్టు మనకు తెలుసు. వారందరికీ పరంపరాగతంగా కర్మయోగము అంతో, ఇంతో తెలిసే ఉంటుంది.

అయితే వారు వారి మంత్రులైన బ్రాహ్మణులచే ప్రోత్సహింపబడి నిష్కామ కర్మకు దూరమై కామ్య కర్మలైన అశ్వమేధ, పుత్రకామేష్టి, రాజసూయం లాంటి యాగాలను చేశారని తెలుస్తుంది.

దానివల్ల కర్మయోగం కొంత మరుగున పడినట్టు మనం గ్రహించవచ్చు.

విద్యా ప్రకాశానంద స్వామివారు వారి గీతామకరందములో పరశురాముడు రాజులను వధించటం వల్ల ఈ బ్రహ్మవిద్య, నిష్కామ కర్మయోగము ప్రచారం సన్నగిల్లిందన్న అభిప్రాయం వెలిబుచ్చారు (పుట 382, గీతామకరందము).

పరశురాముని చర్య వల్ల దుష్టులైన రాజులు చనిపోవటం అనే లాభం చేకూరినా బ్రహ్మ విద్యకు దెబ్బ తగలటం అనే నష్టమూ జరిగింది.

మరి ఆ నష్టాన్ని పూడ్చటానికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అవతరించారు. వారు ఆ యోగాన్ని ఆచరించి, బోధించారు.


మన అదృష్టంకొద్దీ ఆ యోగాన్ని గురించిన జ్ఞానం మనకు అందుబాటులో ఉంది.

కానీ ఒక పక్క గీతా జ్ఞాన యజ్ఞాలు, గీతా జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నా మరొకపక్క చాలా మంది మీరు వరలక్ష్మీ వ్రతం చేయండి,

సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి, మీకు ధన, కనక, వస్తు వాహనాలు వస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి,

పుత్ర సంతానం కలుగుతుంది, ఆయురారోగ్యాలు కలుగుతాయి అని చెబుతూ నిష్కామ కర్మయోగానికి తూట్లు పొడుస్తున్నారు.

కోరికల అగ్నిగుండంలోకి జనాల్ని తోస్తున్నారు. ఏదో పాత తెలుగు సినిమాలోని పాట గుర్తుకొస్తోంది-

”తియ్య తియ్యని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ.

”ఔను, శ్రీకృష్ణుని మాటలు తప్ప ఎవరి మాటలు నమ్మరాదు, సంసార చక్రంలో చిక్కుబడిరాదు, జాగ్రత్తగా మెలగాలి.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/