మొదటి రోజు ముగిసిన బిజెపి కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొద్దీ సేపటిక్రితం మొదటి రోజు సమావేశాలు ముగిసాయి. ఈ భేటీలో ఆర్థిక, రాజకీయ తీర్మానాలు జరిగాయి. పార్టీ ఆర్థిక తీర్మానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రవేశపెట్టారు. పార్టీ ఖర్చులు, ఆస్తులు విరాళాలపై చర్చించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై నేతలు చర్చించడం జరిగింది. అలాగే గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు.

తొలి రోజు స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, ఎంపీ కె.లక్ష్మ‌ణ్‌ల‌తో ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డాలు ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ మోదీ తెలంగాణ నేత‌ల‌ను అభినందించారు. స‌మావేశాల కోసం దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన నేత‌ల‌ను ఆహ్వానించడం ద‌గ్గ‌ర నుంచి వారికి బ‌స‌, భోజ‌నం, ప్ర‌త్యేకించి స‌మావేశాల కోసం ఏర్పాటు చేసిన వేదిక‌లు అద్భుతంగా ఉన్నాయంటూ మోదీ పేర్కొన్నారు.

ఇక ప్రధానికి స్వాగతం పలికే ప్రోటోకాల్‌ను కూడా పాటించని నేత సీఎం కేసీఆర్‌ అని బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యం అన్నారు. రెండు కళ్ల విధానం బీజేపీలో చెల్లుబాటు కాదన్నారు.

బీజేపీ పాలనలో 8 ఏళ్లలో దేశం ఎంతో లబ్ది పొందిందని, 11 కోట్ల మంది రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధులు అందాయని పేర్కొన్నారు. బీజేపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలు అద్భుతమని కొనియాడారు.