విమర్శలకు భయపడకుండా ఈ సినిమా తీశా..

శర్వానంద్-సమంత జంటగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాను. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈమూవీ ఈనెల 7న గ్రాండ్ గా విడుదల కానుంది. దీనితో దిల్ రాజు నేడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం…

రీమేక్స్ జోలికి వెళ్లని మీరు,96 మూవీని రీమేక్ చేయడానికి కారణం?
సినిమా పరిశ్రమలో ఉన్న మా ప్రధాన ధ్యేయం ఓ మంచి సినిమా అందించడం. అది ఏ భాషలో వచ్చినా తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ ఏడాది అనుకోకుండా హిందీ మూవీ పింక్ ని తెలుగులో, 96 తమిళ మూవీని జాను గా తెలుగులో ,తెలుగు జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్నాం. ఇలా మొత్తం మూడు రీమేక్ సినిమాలు చేస్తున్నాం.

ఈ సినిమా రీమేక్ హక్కులు ఎలా దక్కించుకున్నారు?
96 మూవీ విడుదలకు ముందే నిర్మాతతో కలిసి సినిమా చూశాను. సినిమా అయిపోయిన వెంటనే నాకు తెలుగు రీమేక్ హక్కులు కావాలని అడిగాను. ఆయన అడిగిన ఎమౌంట్ కి 10 లక్షలు తక్కువ ఇచ్చాను. హిట్ ఐతే మరో పాతిక లక్షలు ఇస్తాను అని అన్నాను. అన్న ప్రకారం తగ్గించిన 10లక్షలకు మరో15 లక్షలు కలిపి మొత్తం 25లక్షలు ఇచ్చాను.

96 మూవీ కోసం అంత రిస్క్ చేయడానికి కారణం?
నాకు పూర్తిగా తమిళ్ రాదు. అయినప్పటికీ ఆకథలో ఉన్న ప్యూరిటీ నాకు నచ్చింది. భాష రాకపోయినా ఆ రెండు పాత్రలకు నేను కనెక్ట్ అయ్యాను. అందుకే 96 రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాను.

సినిమా ఎవరికైనా చూపించారా?
96 మూవీని విడుదలకు ముందే హీరో నానికి అలాగే బన్నీకి చూపించాను. నాని సూపర్ అన్నారు బన్నీ క్లాసిక్ అన్నారు. విడుదల తరువాత చెన్నైలో సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులతో పాటు, మల్టీ ప్లెక్స్ థియేటర్ లో కూడా నేను చూశాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు 96 బాగా నచ్చింది.

ఏదైనా తేడా కొడితే క్లాసిక్ చెడగొట్టారని విమర్శలు వస్తాయేమో?
కళ్ళతో కాదు మనసుతో ఈ సినిమా చూశాను , అందుకే విమర్శలకు భయపడకుండా ఈ సినిమా తీశాను.

జాను లో ఏమైనా మార్పులు చేశారా?
ఆ కథలోని అసలు ఫ్లేవర్ మార్చలేదు. కాకపోతే ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చెప్పడం జరిగింది. ప్రేమ్ వాటిని అంగీకరించి చిన్న చిన్న మార్పులు చేశారు.

సమంత, శర్వాలను ఎలా ఒప్పించారు?
సమంత మొదట్లో ఒప్పుకోలేదు, త్రిషా బాగా చేశారు, కంపారిజన్స్ వస్తాయి అని భయపడింది. నేనే పట్టుబట్టి ఒప్పించాను. ఇక శర్వా ఒక రోజు వ్యవధిలోనే… మంచి సినిమా, చేస్తాను అని ఓకే చెప్పారు. సమంత, శర్వా నటనతో దర్శకుడు ప్రేమ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

మీ దృష్టిలో 2020 సంక్రాంతి విన్నర్ ఎవరు?
2020 సంక్రాంతి విన్నర్ టాలీవుడ్ అని చెప్పాలి. సాధారణంగా సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే ఎదో ఒకటి మాత్రమే బిగ్గెస్ట్ హిట్ గా ఉంటుంది. ఈ సారి మహేష్, బన్నిలు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించారు. రెండు చిత్రాలు నాన్ బాహుబలి రికార్డ్స్ అందుకున్నాయి. మంచి సినిమా వస్తే ఏ రేంజ్ వసూళ్లు సాధించవచ్చో ఈ రెండు చిత్రాలు నిరూపించాయి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com