దైవ సంకల్పం

ఆధ్యాత్మిక చింతన

The Divine Will
The Divine Will

మన జీవితాన్ని, ప్రపంచగమనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనం అనుకొన్నట్టు కాక దైవసంకల్పం ప్రకారమే అంతా జరుగు తున్నట్టు మనకు సులభంగనే అర్థమవుతుంది.

దైవసంకల్పం, విధిరాత, కర్మ, అదృష్టం లాంటి పదాలను వాడి కొందరు మేధావులు ఎన్నో అక్రమాలకు ఒడిగట్టిన విషయాన్ని కాదనలేం

. అంతా దైవసంకల్పం ప్రకారమే జరుగుతుంది. కాబట్టి నేను ఏమీ చేయకుండా సోమరిగా కూర్చుంటాను అనటమూ తప్పే.

మన ప్రయత్నం మనం చేయవలసిందే. మనం అనుకొన్నట్టు జరక్కపోతే నిరుత్సాహపడటం, నిస్పృహకు లోనుకావటం, ఆత్మహత్యలకు పాల్పడటం తగదు.

ఇక కొంతమంది సాధు పురుషులు దైవసంకల్పంలో వారి సంకల్పాన్ని ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎలా విలీనం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యం కలుగకమానదు.

స్వామి రామసుఖదాస్‌ ‘ఒకటి సాధిస్తే అన్నీ సాధించినట్లే అనే తమ గ్రంధంలో ఒక కథ చెబుతారు. ఒక బాబాజీ ఉన్నాడు. ఒక రోజు పడవలో ఎక్కడికో వెళుతున్నాడు. ఆయనతోబాటు ఆ పడవలో చాలామంది జనులున్నారు.

పడవ ప్రవాహమధ్యానికి చేరింది. ప్రవాహవేగానికి ఒక దిక్కుగా కొట్టుకుపోవడం మొదలుపెట్టింది. ‘అయ్యలారా! మీమీ ఇష్టదైవాలను స్మరించు కోండి.

పడవ అదుపుతప్పింది. ముందు సుడిగుండం కూడా ఉంది. బహుశా మునిగిపోవచ్చు అని పడవవాడు హెచ్చరించాడు

. ఇంతలోనే పడవలోకి కొంతనీరు వచ్చి చేరింది. అందరూ ఏడవడం ప్రారంభించారు. బాబాజీ మాత్రం ‘జయజయరాం, జయసీతారాం అంటూ పాడుతూ తన వద్దనున్న కమండలంతో ఇంకొన్ని నీళ్లు తీసుకొని పడవలోకే వేయడం చేశాడు.

అందరికీ ఆశ్చర్యం, భయం వేసింది. పడవలోని నీటిని తీసి నదిలోకి వేసేబదులు నదిలోని ఈటిని మునిగిపోతున్న పడవలోకి వేసి ఇంకా త్వరగా పడవ మునిగిపోయేట్టు చేస్తున్నాడు

ఈ పిచ్చిసాధువ్ఞ అనుకొన్నారు. కొంతసేపటికి పడవ ప్రమాదస్థలాన్ని దాటి బయటపడింది. అదుపు లోకి వచ్చింది.

పడవవాడు, ఇతరులు ఊపిరిపీల్చు కొన్నారు. గండం గడిచింది అన్నాడు ఆ పడవవాడు.
ఇప్పుడు చాలా ‘జయజయరాం, జయసీతారం అని పాడుతూ తన కమండలంతో పడవలోని నీటిని తోడి నదిలోకి వేశాడు.

అక్కడున్నవారు ఆశ్చర్యపడి ‘నీకు పిచ్చిపట్టిందా? నదిలోని నీరు పడవలోకి వేశావు.

ఇప్పుడు పడవ ప్రమాదం నుంచి బయటపడితే పడవలోని నీటిని బయటికి వేస్తున్నావ్ఞ. ఏమిటి ఇదంతా? అని అడిగారు.

అప్పుడు ఆ బాబా చాలా ప్రశాంతంగా వారితో ‘ఇందులో వింత ఏముంది? పడవ మునిగిపోతున్నప్పుడు పడవను ముంచటం దైవసంకల్పం అని భావిం చాను.

ఆ సంకల్పంతో నా సంకల్పాన్ని లీనం చేశాను, ఆ సంకల్పం త్వరగా నెరవేరటానికి నా వంతు కృషి నేను చేశాను.

మరీ పడవ ప్రమాదం నుంచి బయటపడటంతో పడవను నదిలో ముంచటం కాక, రక్షించటం దైవసంకల్పం అని తెలుసుకొని పడవలోని నీటిని తోడి బయటపడేశాను,.

దైవసంకల్పం నెరవేరటానికి నా వంతు కృషి నేను చేశాను, అంతే అని కళ్లు మూసుకొన్నాడు.

(పుటలు 60,61). ఆబాబా పడవమునిగి పోతున్నప్పుడు అందరిలాగా భయాందోళనలకు గురికాక దేవ్ఞని స్మరించాడు.

పడవప్రమాదం నుంచి బయట పడినప్పుడు అందరిలాగా సంతోషంతో గంతులు వేయక ప్రశాంతంగా దైవస్మర ణలో నిమగ్నమయ్యాడు.

మరణాన్ని, జీవితాన్ని రెంటినీ దైవస్మరణతో స్వీకరిం చాడు. మనం అంతటి ఉన్నతులం కాకపోవచ్చు. కష్టనష్టాల నుంచి బయట పడటానికి శాయశక్తులా కృషి చేద్దాం.

దైవంపై భారం వేసి వాటిని ఎదర్కొం దాం. అంతేగాని నిరాశ నిస్పృహలకులోనై ప్రాణాలను తీసుకోరాదు, ఆత్మహత్య లను చేసుకోరాదు.

ఈ దేహాలలో ఎంతకాం ప్రాణాలుండాలన్నది ఆయన సంకల్పమో, దాన్ని నెరవేర్చటానికే కృషి చేద్దాం.

ప్రాణం పోయలేని మనకు ప్రాణం తీసేహక్కు ఉండదు.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/