అగస్త్య మహర్షి శాపం

Agastya Maharishi
Agastya Maharishi

యాగసరంక్షణార్ధం శ్రీరామలక్ష్మణులను తన వెంట తీసుకుపోతూ విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ‘రామా! పూర్వం సుకేతువనే యక్షుడొకడుండేవాడు. అతనికి సంతానం లేకుండుటచే బ్రహ్మగూర్చి తీవ్రమైన తపస్సు చేశాడు. సదాచారుడు, పరాక్రమవంతుడైనా ఆ సుకేతుడు బ్రహ్మను మెప్పించి తాటక అనే పుత్రికను కన్నాడు. బ్రహ్మదేవుడు ఆ బాలికకు వెయ్యేనుగుల బలం కలిగేట్లుగా వరం ఇచ్చాడు. ఆ బాలిక దిన దిన ప్రవర్ధమానమై రూప యౌవనాలను సంతరించుకుంది. ఆమెకు యుక్త వయస్సు రాగానే సుకేతువు ఆమెను ఝర్ఘుని కుమారుడైన సుందునకిచ్చి వివాహం చేశాడు. కొంత కాలానికి వారిరువురకు మారీచుడనే కుమారుడు కలిగాడు.

ఒకానొక రోజున సుందుడు అగస్త్య మహర్షి ఆగ్రహానికి గురయ్యాడు. ఆ మహర్షి వాపం చేత సుందుడు మరణించాడు. సుందుని కుమారుడైన మారీచుడు, తాటకతో కలసి అగస్త్యుని ఎదిరించాలని ప్రయత్నించారు. అప్పుడు మహర్షి వారిని రాక్షసులు కమ్మని శపించాడు. అంతట కుపితయూన ఆ తాటక గర్జిస్తూ అగస్త్యుని మింగటానికి వెళ్లింది. భగవత్స్వరూపుడైన అగస్త్యుడు ఆమెను ‘నీవు ఈ రూపాన్ని విడిచి, వికృతరూపివై మహా యక్షణివై జనులను భయభ్రాంతులను చేయుచుందువుగాక! నీకు అతి భయంకరమైన రూపము కలుగుగాక! అని శపించాడు.

ఈ కథను కొంత జాగ్రత్తగా పరిశీద్దాం. బ్రహ్మ వర ప్రభావంగా సుకేతునకు కలిగిన పుత్రిక తాటక. తాటక తండ్రి సదాచారపరుడు, పరాక్రమవంతుడు. తాటకకు కూడా వెయ్యేనుగుల బలం ఉంది. రూపం ఉంది. తన భర్తను చంపటం వల్ల అగస్త్య మహరిపై ప్రతీ కారచర్యలకు దిగింది. అగస్త్యుడు మహర్సి కాబట్టి ఆమె భర్త చేసిన దుష్కార్యాన్ని వివరించి ఆమెకు తగిన బోధ చేసి నచ్చ చెప్పి యుండవచ్చు. ఒకవేళ ఆమె ఆయన మాటలను లెక్కచేయక ఆయన్ను మింగబోయి ఉంటే శక్తి హీనురాలు కమ్ము అని శపించి యుండవచ్చు. అప్పుడు ఆమెకు మాత్రమే హాని కలిగి ఉండేది. అలాకాక ఇప్పుడు ఆయన ఆమెకిచ్చిన శాపం ఆమెకు మాత్రమే శాపం కాక ఎందరో అమాయకులకు శాపమైంది.

ఎంత మంది ఆమె భయంకరాకారాన్ని చూసి మరణించారో, ఎంత మంది పిచ్చి పట్టి దిక్కుతోచక పారిపోయారో! లోకానికి ఎంత కీడు జరిగిందో! లోకుల హితం కోరి తాటకను సంహరించమని విశ్వామిత్రుడు కోరుతాడు. శ్రీరాముడు ఆమెను సంహరిస్తాడు. ఆమెనుంచి లోకానికి ముప్పు తప్పుతుంది. అంటే ఆగస్త్య మహర్షి చేసిన తప్పును విశ్వామిత్ర మహర్షి సరిదిద్దినాడని తెలుస్తున్నది. ఒక శాస్త్రజ్ఞుడు ఆ అణుశక్తినే ప్రజాప్రయోజనాలకు ఎలా వినియోగవంచవచ్చో చూపుతాడు. ఒక మహర్షి నుంచి లోకానికి మంచి జరుగవచ్చు.

కీడు జరుగవచ్చు. అలాగే ఒక శాస్త్రజ్ఞుడి నుంచి లోకానికి మంచి జరుగవచ్చు. కీడు జరుగవచ్చు. ఒక వ్యక్తిని మహర్షి అనినంతనే అతను చేసిన ప్రతిపని మంచి అయి ఉంటుందని ఒక వ్యక్తిని శాస్త్రజ్ఞుడు అనినంతనే అతను చేసిన ప్రతి పని కీడు చేసేదే అయి ఉంటుందని భావించటం మూఢవిశ్వాసమే అవుతుంది. నిజానికి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి నూటికి నూరుపాళ్లు మంచి వాడుగా కానీ, చెడ్డవాడుగా కానీ ఉండదు. తాటకకు శాపమిచ్చి లోకానికి కీడు చేసిన అదే అగస్త్యమహర్షి రామరావణ యుద్ధ సమయంలో శ్రీరామునకు ఆదిత్యహృదయస్తోత్రాన్ని ఉపదేశించి లోక కంఠకుడైన రావణాసురుని సంహరింపచేసి లోకానికి ఎంతో మేలు చేశాడు. విశ్వామిత్ర మహర్షి కూడా ఎన్నో మంచి పనులు, ఎన్నో చెడు పనులు చేసినట్లు పురాణాల వల్ల మనకు తెలుస్తుంది. దేవుడిచ్చిన విచక్షణా జ్ఞానాన్ని బాగా వినియోగించి మనం నిష్ఫక్షపాతంగా ఆలోచించి నిర్ణయాలకు రావాలి. అదే ఆధ్యాత్మికానికి రాచబాట అవుతుంది.
– రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/