తెలంగాణలోమద్యం తెస్తున్న సంక్షోభం?

లక్ష్మి కటాక్షం లేకపోతే జీవనం సాగించ డం ఎంత దుర్భరంగా ఉంటుందో ప్రత్యేకించి వేరే చెప్పాల్సిన పనిలేదు. వ్యక్తి కానీ, కుటుంబం కానీ, ప్రభుత్వం కానీ ఆదాయం లేకుండా నడవడం, నడపడం సాధ్యం కాదనేది జగ మెరిగిన సత్యం.

Alcohol

అందులోనూ ప్రజాసంక్షేమమే ధ్యేయ మని చెప్పుకుంటూ నిరుపేద బలహీన, బడుగు వర్గాల అభ్యున్నతికి వేలాది కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా వెచ్చిస్తున్న ఈ రోజుల్లో ప్రభుత్వాలకు నిధులు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రజల మీద భారం వేయక తప్పదు. ఇందులో మరో అభిప్రాయానికి తావ్ఞలేదు.

నిధుల సమీ కరణకు పన్నులో, లేక అప్పులో తప్ప మరో మార్గం లేదనేది అందరికీ తెలిసిందే. అధికారంలో ఎవరు ఉన్నా ఏదోఒక రూపంలో ప్రజల వద్ద నుంచి డబ్బు వసూలు చేయకతప్పదు. అది సరిపోనప్పుడు అప్పుల బాధ ఉండనే ఉంది. కానీ అందుకు ఒక పద్ధతి ఉండాలి, ఒక విధానం ఉండాలి, ఒక మార్గం ఉండాలి. ఎన్ని పన్నులు వేసినా మరే రూపంలో నిధులు సేకరించే ప్రయత్నాలు చేసినా ప్రజలకు అందువల్ల కష్టనష్టాలు ఉండకూడదు.

ప్రజలు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఇక్కట్లలోకి నెట్టివేయకూడదు.పన్నులు వేసే కొద్దీ ధరలు పెరుగు తాయి. జిఎస్టీ అన్నా, లేక మరే రూపంలో పన్నులు ఏ వస్తువ్ఞపై వసూలు చేసినా చివరకు ఆ భారమంతా మోసేది ప్రజలు అనేది వాస్తవం. అంతేకాదుఆదాయాన్ని దృష్టిలోపెట్టుకుని వ్యయం చేస్తుండాలి. కానీ పరిస్థితులు మారుతున్నాయి.

ఆదాయం గురించి పట్టించుకోవడం లేదు. ఇష్టానుసారంగా పథకాలు ప్రవేశపెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరింత ఉధృతంగా పోటీ పడి చేస్తున్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం అధికారం కోసం జనాకర్షక పథకాలు కోకొల్లలు ప్రకటిస్తున్నారు. వేలాది కోట్ల రూపాయలు నీళ్లలా వెచ్చిస్తున్నారు. ఆదా యం పెంచుకునేందుకు నిత్యం అన్వేషణ జరుగుతున్నది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం ధరలు సగటున 20 శాతం వరకు మొన్న పెంచింది. ఈ ధరల పెంపు తక్షణం అమలులోకి వస్తున్నట్లు కూడా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ప్రజలజీవితాలు, ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న చీప్‌ లిక్కర్‌ను కూడా వదిలిపెట్టలేదు. అసలు ఈ ఏడాది ఎక్సైజ్‌ సంవత్సరం ప్రారంభంలోనే దరఖాస్తుల రుసుం ద్వారా దాదాపు 930 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.

ఇప్పుడు ఈ ధరలను పెంచడం వల్ల ఏడాదికి మూడువేల ఐదు వందల కోట్ల రూపాయలకుపైగా ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఆదాయం ఇరవైఐదు వేల కోట్లకు మించవచ్చునని ఎక్సైజ్‌ శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. మరొకపక్క ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటీవలనే మద్యంరేట్లు పెంచారు. అయితే అక్కడ దశల వారీగా మద్యనిషేధం అమలులో భాగంగా షాపులను, బార్లను కుదించి రేట్లను పెంచారు.

రేట్లు పెంచడం వల్ల కొనుగోలు తగ్గుతుందని అందువల్ల వినియోగం కూడా గణనీయంగా పడిపోతుందని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. దశలవారీగా నిషేధాన్ని అమలు చేసే విధానానికి అనుగుణంగానే ఈ రేట్లు పెంచినట్లు ఆంధ్రప్రదేశ్‌ పాలక పెద్దలు చెప్పుకుంటున్నారు. కానీ రెండు రాష్ట్రాల్లో కూడా మద్యం ఆదాయమే ప్రధానంగా మారింది. మరింత పెంచుకునేందుకే అడుగులు వేస్తున్నా రు. అందుకు పెరుగుతున్న ఆదాయాన్ని ఉదాహరించ వచ్చు.

ఈ ఏడాదే కాదు ప్రతి ఏడాదికేడాదికి ఎక్సైజ్‌ ఆదాయం ఊహించని రీతిలోనే పెరుగుతుందని ఎక్సైజ్‌ అధికారులే గర్వంగా చెప్పుకుంటున్నారు. పెంచేందుకు అన్ని మార్గాలను అధికారులు అవలంబిస్తున్నారు. ఎక్సైజ్‌ ఆదాయమే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఖజానాలకు ప్రధాన ఆర్థికవనరుగా మారిపోయిందని చెప్పొచ్చు.కానీ ఒక్క విషయాన్ని విస్మరిస్తున్నారు.

ప్రభుత్వం రూపొందించే మద్యంవిధానాలు అందువల్ల పెరుగుతున్న ఆదాయం అంతిమంగా సమాజంపై అనేక రూపాల్లో దుష్ప్రభావం చూపుతున్నాయి. తాగుడు మూలంగా జరుగుతున్న అనర్థాలు అన్నీ ఇన్నీ కావ్ఞ. మహిళలపై అఘాయిత్యాలు, గృహహింస, లైంగిక వేధింపులు, రహ దారి ప్రమాదాలు,ఒకటేమిటి నేరాలన్నింటికీ మద్యమే మూలమవ్ఞతున్నది. ఏడేళ్లక్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, ఆ తర్వాత హత్య కేసులో కానీ, మొన్న హైదరాబాద్‌ శివారులో తొండుపల్లి టోల్‌గేట్‌వద్ద జరిగిన దిశ అత్యాచారం, హత్య నిందితులందరూ పూర్తిగా మద్యంమత్తులో ఉన్నవారే.

ఈ కేసులే కాదు మహిళలపై జరుగుతున్న ఈ నేరాల్లో నిందితుల్లో 90 శాతంపైగా మద్యం మత్తులో ఉండేచేస్తున్నారు.అన్నింటి కంటే మించి ఇటీవల మానవత్వం మరిచి కుటుంబ సభ్యులపైనే దాడి, అత్యాచారం లాంటి ఘోరనేరాలకు ఒడిగడుతున్నారు.

మద్యంమత్తు దిగిన తర్వాత తాము ఎంతటి ఘోరానికి పాల్పడ్డామో తెలుసుకొని కృంగికృశించిపోతున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగి నిందితులు జైలు పాలవ్ఞతున్నారు.ఎన్నో కుటుంబాల్లో పిల్లలు అనాధలుగా మారుతున్నారు. ఇక ప్రమాదాల గురించి చెప్పనక్కర్లేదు.

తెలుగురాష్ట్రాల్లోనే ఏటా పదిహేనువేల మందికిపైగా మరణిస్తున్నారు. మద్యం మత్తులో కొందరు యువకులు చేస్తున్న బీభత్సానికి అన్నెంపున్నెం ఎరుగని అమాయకు లు బలైపోతున్నారు.ఇన్ని అనర్థాలకు మూలమైన మద్యా న్ని పాలకులే పెంచిపోషించడం బాధాకరం. ఒకపక్క సంక్షేమం అంటూ అందుకోసం మద్యం ఆదాయంపై ఆధారపడి ప్రజలను ఆర్థికంగా,ఆరోగ్యపరంగా సంక్షోభంలోకి నెట్టడం ఏమాత్రం సమంజసంకాదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/