విశ్వధర్మములు

ఆధ్యాత్మిక చింతన

Lord Krishna

ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరదులు, బంధువులు వీరిని నేను ప్రాణాలు పోయినా ఈ భూమి కొరకు కాదు కదా ముల్లోక రాజ్యం కొరకు కూడ చంపను అంటాడు అర్జునుడు.

వారందరూ అధర్మాన్ని రక్షించటానికి, నిన్ను చంపటానికి ఉత్సాహంగా, సిద్ధంగా ఉన్నారు కదా, నువ్వు ధర్మాన్ని రక్షించటానికి వారితో యుద్ధం చేయటానికి జంకితే, హృదయ దౌర్బల్యాన్ని పొందితే మంచిదికాదు అన్నాడు శ్రీకృష్ణుడు.

యుద్ధం జరిగితే కులనాశనం కులధర్మాలు నష్టం జరుగుతుందన్నది అర్జునుని చింత. ఆ చింత భీష్మ, ద్రోణ కృపాదులకు, దుర్యోధనాదులకు లేనప్పుడు నీకెందుకు? కులము, కులధర్మాలు నశిస్తే వచ్చే నష్టం కన్నా విశ్వము, విశ్వధర్మములు నశిస్తే వచ్చే నష్టము ఎక్కువ అని అంటాడు శ్రీకృష్ణుడు.

ఎందరెందరో కులపురుషులు చెడిపోయినప్పుడు దిగులు పడని అర్జునుడు ఇప్పుడు కులస్త్రీలు చెడిపోతారు అని దిగులుపడతాడు.

కృష్ణునకు కావలసింది కులస్త్రీలు చెడిపోకుండా ఉండటం కాదు, ధర్మదేవత భ్రష్టుపట్టకుండా ఉండటం. వర్ణసాంకర్యం జరుగరాదన్నది అర్జునుని అభిప్రాయం. ధర్మ సాంకర్యం జరుగరాదన్నది శ్రీకృష్ణుని భావము. పిండోదక క్రియలు లేక పితరులు అధోగతి చెందుతారు అని అంటాడు అర్జునుడు.

మరణించిన పితరులు, పితృదేవతలు అధోగతి చెందుతారని నీవుదిగులు పడుతున్నావు సరే, దుర్యోధనాదులను బతుకనిస్తే వారికి రాజ్యాన్ని కట్టబెడితే ప్రస్తుతం జీవిస్తూ ఉన్న, ఈ లోకంలోనే ప్రత్యక్షంగా మనకు కనబడుతున్న మన పిల్లల, పాపల బ్రతుకు, ప్రజల బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటాయో దాన్ని గురించి ఆలోచించవా అన్నది శ్రీకృష్ణుని ప్రశ్న.

మోహంలో, అజ్ఞానంలో ఉన్న అర్జునుడు మహాపండితునిలా ఎన్నెన్నో అభిప్రాయాలను వెలిబుచ్చుతాడు.

ప్రశ్నశలను వేస్తాడు, సంశయాలను, సందేహాలను తెలుపుతాడు. అన్నిటినీ సావధానంగా విన్న శ్రీకృష్ణపరమాత్మ అన్నిటికీ సరైన సమయంలో, సరైన విధంగా స్పందిస్తాడు.

అయితే అర్జునుని ప్రశ్నకు వెంటనే కృష్ణుని సమాధానం కొన్నిసార్లు మనకు లభించకపోవచ్చు.

జాగ్రత్తగా భగవద్గీతనంతా క్షుణ్ణంగా పరిశీలించాలి. అర్జునుడు ఎప్పుడూ భూతకాలంలోకి పోయి పితరులకు పిండోదకాలు లభించకపోతే ఎట్లా అని అనన్నా ప్రశ్నిస్తాడు.

లేకపోతే భవిష్యత్కాలంలోకి పోయి కులధర్మాలు నశిస్తే, వర్ణసాంకర్యం ఏర్పడితే ఎట్లా అనన్నా అడుడుతాడు. శ్రీకృష్ణుడు వర్తమానాన్ని గురించి శాశ్వత సత్యధర్మాలను గురించి బోధిస్తాడు.

ప్రస్తుత కర్తవ్యాన్ని నిర్వర్తించి ఫలితాన్ని దైవానికి వదలమంటాడు. అర్జునుడు ఇంకా మోహంలోనే ఉన్నాడని ఆయనకు బాగా తెలుసు. సరైన ఎన్నిక చేయలేడని తెలుసు.

అందుకే ఆయన వెంటనే ‘మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామే వైష్యసి యుక్వైవ మాత్మానం మత్పరాయణః నా మనసు నాయందు నిలుపు.

నా భక్తుడవు కమ్ము, నన్ను భజించు, నాకు నమస్కరించు, నా యందు తత్పర భావంతో చిత్తాన్ని సమాధానం చేసుకుని నన్నే చేరుకుంటావ్ఞ అని చెబుతాడు.

నిజానికి ఈ సలహా అర్జునునికే కాదు, ఆయన అర్జునుని ఎంతగా ప్రేమిస్తాడో మనల్నందరినీ అంతే ప్రేమిస్తాడు.

అయినా మనం ఆయన సలహాను పాటించక నానా ఇతర దేవతలను వ్యయ ప్రయాసలకు లోనై పూజిస్తే వారిని పొందుతాము, జీవితాంతం తద్దినాలు, తర్పణాలు చేసి పితరులను కొలిస్తే పితరులను పొందుతాము, భూతములను ఉపాసిస్తే వాటినే పొందుతాం. మళ్లీ పుడతాం, మళ్లీ ఛస్తాం. మరీ మరీ కష్ట నష్టాలపాలై కన్నీరు కారుస్తాం.

శ్రీకృష్ణ భగవానుని సలహాను స్వీకరించి తదనుగుణంగా జీవించకపోతే మనం మూఢులమే. శ్రీకృష్ణ పరమాత్ముని శరణు జొచ్చి ధన్యజీవులమవుదాం.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/