భగవద్గీత

ఆధ్యాత్మిక చింతన

The Bhagavad Gita
The Bhagavad Gita

ఈ లోకంలో దైవీ సంపత్తితో పుట్టిన వారు, ఆసురీ సంపత్తితో పుట్టిన వారు ఉంటారని శ్రీకృష్ణుడు అంటాడు. తేజము, క్షమ, ధృతి, శౌచము, స్వాతిశయం లేకుండుట ఇలాంటి లక్షణాలు దైవీసంపత్తితో పుట్టిన వానికి ఉంటాయి అని అంటాడు. మనలో అత్యధికులకు ఈ లక్షణాలు ఏవీ ఉండవు. కాబట్టి మనకు దైవీ సంపద లేదని ఇట్టే అర్ధమవుతుంది.
దంభో దర్బోభి మానశ్చ క్రోధః పారుష్యమేవచ
అజ్ఞానం చాభి జాతస్య పార్థ సంపదమాసురీమ్‌
దంబము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము ఆసురీ సంపత్తితో పుట్టిన వానికి ఈ లక్షణాలు ఉంటాయి అని శ్రీకృష్ణపరమాత్మ చెబుతాడు. మనము ఆత్మ పరిశీలన నిష్పక్షపాతంగా చేసుకుంటే మనలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అంటే మనం అసురుల కోవకు చెందిన వారం. రావణాసురుడు, నరకాసురుడు, వృత్రాసురుడు, శకటాసురుడు, ధేనుకాసురుడు, బాణాసురుడు వీరి అనుచరులం. అలాగై యుండి ఈ అసురులను చంపిన శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని ఆరాధిస్తాం. మన పార్టీకి చెందిన లేక మన నాయకులైన రావణాసురుడిని చంపిన శ్రీరాముడిని, నరకాసురుడిని వధించిన శ్రీకృష్ణుడిని మనం ఆరాధిస్తే వారి జన్మదినాలను పండుగలుగా జరుపుకుంటే అందులో ఔచిత్యమేముంది? అంటే శ్రీరామనవమిని దీపావళి లాంటి పండుగలను మనము జరుపుకోరాదని అర్ధమా? కాదు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు దైవీ గుణాలు, దైవీ సంపదను కలిగి ఉండి దేవతలుగా మారి పూజలందుకొంటున్నారు.

మనము ఆసురీ లక్షణాలతో ఆసురీ సంపదతో పుట్టిన వారం, అసురులం. జీవితంతం అలాగే ఆ అసుర లక్షణాలతోనే ఉండక, ప్రయత్నంతో అసుర లక్షణాలను వదిలించుకుని దైవీ లక్షణాలను పెంపొందించుకుని దేవతలుగా మారి, దేవతల పక్షములోకి చేరి, అప్పుడు మన నాయకులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అసురులను సంహరించిన సందర్భాలను గుర్తుకు తెచ్చుకుని, ఆనందంగా, ఉత్సాహంగా, చురుకుగా ఉత్సవాలను జరుపుకోవాలి.

అది సముచితంగా ఉంటుంది. నిజానికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అసురులను చంపితే మనకొచ్చిన ప్రయోజనమేమీలేదు. మనము మనలోని అసుర గుణాలను సమూలంగా సంహరించాలి, దైవగుణాలను పెంచి పోషించాలి. అప్పుడు ప్రతిరోజు దీపావళి పండుగే. ప్రతి క్షణమై శ్రీరామనవమే. మన జీవితమంతా పండుగే అవుతుంది. ‘ప్రవృత్తించ నివృత్తంచ జనాన విదురాసురాః అని అంటాడు శ్రీకృష్ణుడు. అంటే అసురులకు ప్రవృత్తి తెలియదు.

నివృత్తి తెలియదు అని అర్ధం. ‘ప్రవృత్తి అంటే ప్రవర్తన అని ‘నివృత్తి అంటే అనర్ధ హేతువులను నివారించటం అని శంకరాచార్యుల వారు అంటారు. మనం అసురులుగానే ఉండక సద్గుణాలను అలవరచుకొని సత్ప్రవర్తన కలిగి యుండి.

అనర్ధహేతువులైన దుర్గుణాలనన్నిటినీ కూకటి వేళ్లతో సహా పీకి పారేసి మనకు ప్రవృత్తిని, నివృత్తి, రెండూ తెలుసని ప్రపంచానికి చాటి చెప్పి మనమే ఒక శ్రీరామునిగా, ఒక శ్రీకృష్ణుడిగా నిలిచిపోవాలి. సంఘంలో ఉండే దుర్మార్గాన్ని ఎలా రూపుమాపాలి? అని ప్రశ్నిస్తే వివేకానందుడు, జిడ్డు కృష్ణమూర్తి లాంటి వారు ‘నీలో ఉండే దుర్మార్గాన్ని రూపుమాపు. సంఘం అదెందుకదే బాగుపడుతుంది అని జవాబిచ్చేది అందుకే. మనలాంటి వాళ్లు సమూహమే సంఘం. మనము దేవతలమైతే ఈ సంఘమే స్వర్గం.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/