శ్రీమద్భగవద్గీత

ఆధ్యాత్మిక చింతన

The Bhagavad Gita

వేదేషు యజ్ఞేషు తపః సుచైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్‌
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్‌


ఇది భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మయోగము 8వ అధ్యాయము 28వ శ్లోకము. దీని అర్ధం యోగియైనవాడు దీనిని ఎరిగి వేదములందును, యజ్ఞములందును, దానములందును, తపస్సు లందును ఏ పుణ్యఫలము చెప్పబడియున్నదో, దానినంతను అతిక్రమించుచున్నాడు. దానిని మించిన పుణ్యఫలమును పొందుచున్నాడు.

అనాదియగు సర్వోత్వమ స్థానమును పొందుచున్నాడు. భగవద్గీత అయిదువేల యేళ్ల క్రింద రాయబడింది. చెప్పబడింది. గానం చేయబడింది. అయినా ఈనాటికీ మనం చెప్పుకొంటున్నాం. ఎందుకంటే దేశ కాలపరిస్థితులు ఎంత మారినా అందులోని విషయం చెక్కుచెదరని, మొక్కవోని సత్యమని మరీ మరీ నిరూపితమైంది.

ఈనాడు మన సంఘాన్ని, మన చుట్టూ ఉన్న వ్యక్తులను గమనిస్తే పుణ్యఫలాన్ని పొందటానికి వేదాధ్యయనం చేసి, సారాన్ని గ్రహించి, ప్రవచనం ద్వారా, రచనల ద్వారా దాన్ని ప్రజలకు పంచే ప్రముఖులను ఎందరినో చూస్తున్నాం. ఎంతెంతో ఖర్చుచేసి, మరెంతో శ్రమకోర్చి యజ్ఞాలను జరిపించే స్వామీజీలను చూస్తున్నాం.

ధార్మిక సంస్థలను చూస్తున్నాం. లక్షలు, కోట్లు రూపాయలను ఖర్చు చేసి గోదానం, భూదానం, సువర్ణదానం చేస్తున్న శ్రీమంతులను చూస్తున్నాం.

భార్యాపిల్లలను, తల్లిదండ్రులను, ఇల్లు – వాకిలిని వదలి కొండగుహల్లోకి వెళ్లి, గడ్డాలు, మీసాలు పెంచి, తిండి – తీర్ధం మాని, ముక్కు మూసుకుని తీవ్ర తపస్సులను చేసే వారినీ చూస్తున్నాం.

అయినా వీరంతా కూడా శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరమణ మహర్షి పేర్లు వింటేనే చేతులు జోడించి భక్తిపూర్వకంగా కళ్లు మూసుకుని నిలబడతారు.

మరి రామకృష్ణుడు కానీ, రమణుడు కానీ వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారు కారు. పండితులు కారు, వారు ధన వ్యయం చేసి యజ్ఞయాగాదులను చేసిన వారు కారు.

అసలు వారు డబ్బును ముట్టేవారు కారు. గడ్డాలు, మీసాలు పెంచి వారు తపస్సు చేసేవారు కారుగానీ పంచవటిలో రామకృష్ణుడు, తిరువణ్ణామలైలో రమణుడు అంతర్ముఖులై ఉండేవారు.

జీవాత్మ – పరమాత్మల యోగమంటే అదేనేమో! అందుకే వారిని వేద పండితులు, యజ్ఞనిర్వాహకులు, తాపసులు, శ్రీమంతులు సాక్షాత్తు దైవస్వరూపులుగనే భావిస్తారు. ఇదంతా మనం ఈనాడు కళ్లారా చూస్తున్న విషయం.

భగవద్గీత శ్లోకంలో ఉన్నది నూటికి నూరుపాళ్లు సత్యమేనని చెప్పటానికి రామకృష్ణుల, రమణుల జీవితాలే తార్కాణాలు కదా. వేదాధ్యయనం చేసిన పండితుకన్నా, యజ్ఞాలు చేసిన ఘనులకన్నా, తీవ్ర తపస్సులు చేసిన సాధువ్ఞలకన్నా,

దానాలు చేసిన ధనికుల కన్నా వారు పొందిన స్థితి గొప్పది కదా! సర్వోత్తమ స్థానము కదా! అట్టి సజీవసాక్ష్యాలు మన ముందుంటే గీతాజ్ఞానాన్ని విజ్ఞానంగా చేసుకోవటానికి మనం ప్రయత్నించకపోతే గీతాజయంతులను, కృష్ణజయంతులను ఎన్ని జరుపుకొంటే ఏమి ప్రయోజనం? మకరందాన్ని పొగడితే చాలదు, గ్రోలాలి, తృప్తిగా జుర్రుకోవాలి.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి https://www.vaartha.com/specials/investigation/