కరోనా.. ప్రధానికి పారిశ్రామికవేత్తల విజ్ఞప్తి

కరోనా మహమ్మారిని తక్కువగా అంచనా వేయవద్దు..వెంటనే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించండి

corona
corona

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడికి కరోనా వ్యాప్తి నేపథ్యంలో 51 మంది పారిశ్రామికవేత్తలు వెంచర్ కాపిటలిస్టులు కోరారు. దేశంలో రోజురోజకు పెరుగుతున్న కరోనా మహమ్మారిని తక్కువగా అంచనా వేయవద్దని, వెంటనే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి, పరిస్థితిని కంట్రోల్ చేయాలని వారు కోరారు. ఈ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ఇండియా మొత్తం కనీసం వారం రోజుల పాటు 144 సెక్షన్ విధించాలని, పరిశ్రమలన్నింటికీ లాక్ డౌన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఓ సవివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తయారు చేసిన అర్బన్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అభిరాజ్ సింగ్ భల్, సౌత్ కొరియా, సింగపూర్, జపాన్ వంటి దేశాలు, ముందుగానే స్పందించి, కఠినమైన నిర్ణయాలు తీసుకుని వైరస్ వ్యాప్తిని అరికట్టాయని ఉదాహరణలతో సహా వెల్లడించారు. ఇదే సమయంలో ఇరాన్, ఇటలీ, అమెరికా వంటి దేశాలు వేచి చూసే ధోరణితో ఉండిపోబట్టే, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయని, ఆ దేశాల్లో కరోనా విజృంభించిందని తెలిపారు. దేశ పౌరులందరూ కనీసం రెండు వారాల పాటు ఇళ్లలోనే ఉండిపోవాలని, అప్పుడే వైరస్ నియంత్రణలోకి వస్తుందని, అన్ని రకాల రవాణా వ్యవస్థలను నిలిపివేయాలని, పాలన స్తంభించినా, ప్రజారోగ్యానికి ఇదే క్షేమమని వెల్లడించారు. ఈ తరహా చర్యలతో 30 రోజుల తరువాత కరోనా మరణాల సంఖ్య ఐదు రెట్లు తగ్గుతుందని ఈ ప్రజంటేషన్ లో ఎంటర్ ప్రెన్యూరర్స్ అంచనా వేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/