తెలంగాణ రాష్ట్రంలో ఆక్యుపంక్చర్‌ విశ్వవిద్యాలయం, కళాశాలలు ఏర్పాటు చేయాలిసైఫాబాద్‌ : ఆక్యుపంక్చర్‌ వైద్య విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర వైద్య విధానంగా గుర్తింపును ఇచ్చిందని తెలంగాణ ఆక్యుపంక్చర్‌ వైద్యుల సంఘం తెలిపింది. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజంతోపాటు బోధించబడిన ఆక్యుపంక్చర్‌ వైద్య విధానాన్ని పునరుద్ధరించాడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సంఘం విజ్ఞప్తి చేసింది. గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పిహెచ్‌సిసి జాతీయ ఎగ్జీక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ పి.ఎస్‌.సాగర్‌, ప్రతినిధులు డాక్టర్లు బి.ఎస్‌.ప్రసాదరావు, వెంకటేశ్వరరావు, త్రివిక్రమరావు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆక్యుపంక్చర్‌ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం స్ధలాన్ని, తగినన్ని నిధులను కేటాయించాలని, అలాగే విశ్వవిద్యాలయాన్ని, కళాశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు విజ్ఞప్తి చేశారు.ప్రాచీన కాలంలో మన భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం ఆక్యుపంక్చర్‌ వైద్యం అభివృద్ధి చెందిందని నాగార్జున కొండ, నలందా, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ఈ వైద్య విద్యను బోధించడం జరిగిందని, అగత్స్య మహర్షి, జీవక మహర్షి లాంటి ప్రాచీన వైద్యులు ఈ వైద్యాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.