పవిత్రమైన బతుకమ్మ వేడుకలో ఎమ్మెల్యే రాజయ్య ఆలా రావడం ఆగ్రహం తెప్పిస్తున్నాయి

తెరాస స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులందరికి భర్త లాంటోడని చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదం రేపాయో తెలియంది కాదు. రాజయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చీరలు తగులబెట్టిన మహిళలు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన రాజయ్య తాను తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరారు. ఇది జరిగిందో లేదో మరుసటి రోజే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో బయటకొచ్చింది. ఈ రెండే అనుకుంటే ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు.

తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండగలో పాల్గొన్న రాజయ్య మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అయితే ఎంతో పవిత్రంగా భావించే బతుకమ్మ వేడుకల్లో రాజయ్య చెప్పులు వేసుకుని పాల్గొనడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆయనతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా కాళ్లకు చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. రాజయ్య చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆడటం సిగ్గు చేటని, హిందూ సమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.