జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. భారత ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రమూకలు దాడి చేశాయి. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు భారత జవాన్లు అమరులయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా మచెడి ప్రాంతంలో భారత ఆర్మీ కాన్వాయ్‌పై సోమవారం జరిగిన ఘోరమైన ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఇండియన్ ఆర్మీ 9 కార్ప్స్ పరిధిలో జరిగింది. రక్షణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కథువా నుంచి 150 కి.మీ దూరంలో ఈ దాడి జరగ్గా, ఆ సమయంలో ఆర్మీ వాహనాలు మాచెడి-కిండ్లీ-మల్హర్ రహదారిపై సాధారణ పెట్రోలింగ్‌లో నిర్వహణలో ఉన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పుల నేపథ్యంలో అధికారులు అదనపు బలగాలను పంపించారు. ఉగ్రవాదులు కొండపై నుంచి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. గ్రెనెడ్లు కూడా విసిరారని సంబంధిత అధికారులు తెలిపారు. కాల్పుల తర్వాత మన సైనికులు కూడా ప్రతీకారం తీర్చుకున్నారని, దాంతో ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారని అధికారులు తెలిపారు. గత నాలుగు వారాల్లో కథువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల్లో ఇది రెండో అతిపెద్ద ఘటన. మరోవైపు కుల్గామ్‌లో భారత ఆర్మీ ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చిన తరువాత ఈ దాడి జరిగింది. జూన్ 12, 13 తేదీలలో సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ చేయడంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం ఎదురుకాల్పులు జరపగా, ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు, ఓ జవాన్ చనిపోయారు. జూన్ 26న దోడా జిల్లాలోని గండోహ్ లో ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిసిందే.

రియాసి జిల్లాలోని శివ్ ఖోరి ఆలయం నుంచి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై జూన్ 9న ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్, కండక్టర్‌తో సహా తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 41 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు.