దసరా టార్గెట్ గా హైద్రాబాద్ లో ఉగ్రదాడికి ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్ లో ఉగ్రదాడికి ప్లాన్ చేసింది పాకిస్థాన్. కానీ దీనిని పోలీసులు కనిపెట్టి భగ్నం చేసారు. ఈ కుట్రలో కీలకంగా పనిచేసిన జాహిద్ అనే వ్యక్తిని హైదరాబాద్, మూసారాంబాగ్‌లో సిట్ , టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుఝామున సిట్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు మహమ్మద్ జాహిద్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ నేతలపై దాడులతోపాటు, పేలుళ్లకు జాహిద్ కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. అంతేకాకుండా ఉగ్రవాద కార్యక్రమాల కోసం కొంతమంది యువకులను కూడా రిక్రూట్ చేసినట్లు తెలుస్తోంది.

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా.. దానికి సంబంధించి లింకులు హైదరాబాద్‌లో దర్శనమిస్తున్నాయి. తాజాగా పోలీసులు అలెర్ట్ అయ్యి భారీ ప్లాన్‌కు చెక్ పెట్టారు. 15 ఇళ్లలో సోదాలు జరిపి.. దాదాపు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న అబ్దుల్ జాహిద్‌ ను పోలీసులు అందుపులోకి విచారణ జరిపారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాహిద్‌ తోపాటు.. మరో ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దసరా ఉత్సవాలను టార్గెట్ చేసిన జాహిద్ టీం.. మూకుమ్మడి దాడులకు పాల్పడాలని ప్లాన్ చేసుకుంది. మరో సంచలన విషయం ఏంటంటే.. పాకిస్తాన్‌ హ్యాండ్లర్స్ ద్వారా జాహిద్‌కు నిధులు అందుతున్నాయని పోలీసులు గుర్తించడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. హైదరాబాద్‌లో దాడుల కోసం.. పాక్ నుంచి ఉగ్రవాదులు పేలుడు పధార్థాలు కూడా పంపించారని సమాచారం. ఇదే విషయాన్ని జాహిద్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాడులు చేసి.. పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని కుట్ర పన్నినట్టు సమాచారం.