చంద్ర‌బాబు కుప్పం టూర్‌లో ఉద్రిక్త‌త‌..

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం టూర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ – వైస్సార్సీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. మూడు రోజుల పర్యటన నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. కుప్పం ప‌రిధిలోని రామ‌కుప్పం మండలంలో చంద్ర‌బాబు పర్యటన కొన‌సాగుతుండ‌గానే… మండ‌లంలోని కొల్లుప‌ల్లెలో చంద్ర‌బాబు వ‌చ్చే మార్గంలో వైస్సార్సీపీ కార్యకర్తలు జెండాల‌ను కట్టారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన టీడీపీ శ్రేణులు ఆ జెండాల‌ను తొల‌గించే య‌త్నం చేయ‌గా…వారిపై వైస్సార్సీపీ కార్యకర్తలు దాడుల‌కు దిగారు. ఇరువ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టిన పోలీసులు… వైస్సార్సీపీ శ్రేణుల‌ను ఓ ఇంటిలో నిర్బంధించ‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది.

ఈ ఘర్ష‌ణ‌పై స్పందించిన చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కుప్పం నా నియోజ‌క‌వర్గం అని గుర్తు పెట్టుకోండి అంటూ వైస్సార్సీపీ శ్రేణులకు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కుప్పంలో అతిగా ప్ర‌వ‌ర్తిస్తే వైస్సార్సీపీ నేత‌ల తోక‌లు క‌ట్ చేస్తానంటూ ఆయ‌న చుర‌క‌లు అంటించారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో వైస్సార్సీపీ జెండాలు క‌ట్ట‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు.. ఇది ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాన్ని ఉసికొల్ప‌డం కాదా? అని ప్ర‌శ్నించారు.

వైస్సార్సీపీని ప్రజలు తరిమే రోజులు త్వరలోనే వస్తాయని ఈ సందర్బంగా చంద్రబాబు అన్నారు. వైస్సార్సీపీ సర్కారు ఎన్నిరోజులు ఉంటుందో వారికే తెలియదన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పింఛన్లు తొలగించలేదన్నారు. గండికోట జలాశయం ద్వారా పులివెందులకు నీళ్లు తానే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వైస్సార్సీపీ నేతలకు కుప్పం నియోజకవర్గం అంటే కక్ష అని మండిపడ్డారు. కుప్పంలో చోటామోటా నాయకులు రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.