జింఖానా గ్రౌండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి

జింఖానా గ్రౌండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నెల 25న ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న భారత్-ఆసీస్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌కు క్రికెట్ అభిమానులు ఉదయం నుండే భారీగా తరలివచ్చారు. టికెట్ల ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తూ వచ్చారు. కొద్దిసేపటి క్రితమే టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టారు. టిక్కెట్స్ కోసం వచ్చిన వారిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీంతో పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్య తోపులాట జరిగింది. ఈక్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. ఉదయం నుంచి టికెట్స్ ఇష్యూ చేస్తున్నప్పటికీ.. ఆలస్యం జరుగుతోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌ టికెట్ల విక్రయంలో జాప్యంపై ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారంటూ వారంతా మండిపడుతున్నారు.

ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం కెపాసిటీ 55 వేల సీట్లు. ఇందులో దాదాపు 8 వేల సీట్లు రెన్యువేషన్‌ కాలేదు. బాగుచేయని ఆ 8 వేల సీట్లను కూడా హెచ్‌సీఏ అమ్మకానికి పెట్టింది. అయితే హెచ్‌సీఏ బోర్డుపై టికెట్‌ రేటు ఓ విధంగా ఉంటే.. అమ్ముకునే రేట్ల మధ్య చాలా తేడా ఉంది. కార్పొరేట్‌ బాక్స్‌ రేటు రూ.15 వేలు ఉంటే.. లక్షల్లో అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 38 వేల టికెట్ల అమ్మకాలపై కూడా గందరగోళం నెలకొని ఉంది. రూ. 850 నుంచి రూ. 10 వేల వరకూ ఈ టికెట్లను అమ్ముతున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 15న పేటీఎం యాప్‌లో టికెట్లు ఇలా పెట్టారో లేదో.. అలా ఆల్ టికెట్స్ సోల్డ్ అవుట్‌గా చూపించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకై పోయారు. దీంతో ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో టికెట్ల కోసం వేట మొదలుపెట్టారు.