వచ్చే వేసవి నాటికి 10 వ్యాక్సిన్లు అందుబాటులోకి

వెల్లడించిన అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థల సమాఖ్య(ఐఎఫ్‌పీఎంఏ)

COVID-19 Vaccine

జెనీవా: కరోనా మహమ్మారి నియంత్రణ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయన్న విషయంపై అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థల సమాఖ్య(ఐఎఫ్‌పీఎంఏ) కీలక విషయాలు తెలిపింది. వచ్చే ఏడాది వేసవి నాటికి మొత్తం 10 కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నాతో పాటు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు రాబట్టాయని తెలిపింది. అయినప్పటికీ వ్యాక్సిన్ ను అతి త్వరగా తీసుకురావాలన్న లక్ష్యాల నేపథ్యంలో భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపింది.

ఫైజర్‌, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్లే కాకుండా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, నోవావాక్స్‌, సనోఫీ పాశ్చర్‌, మెర్క్‌, జీఎస్కే వ్యాక్సిన్లు కూడా త్వరలోనే మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని ఐఎఫ్‌పీఎంఏ‌ జనరల్‌ థామస్‌ క్వెనీ తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఔషధ తయారీ, బయోటెక్‌ సంస్థలు వ్యాక్సిన్ పరిశోధనలకు భారీగా ఖర్చు చేశాయని చెప్పారు. ఆయా సంస్థలు తమ వ్యాక్సిన్‌పై పెటేంట్‌ హక్కుల్ని రక్షించుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ తయారీకి తప్పనిసరిగా లైసెన్స్‌ ఇవ్వాల్సిందేనంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ సదస్సులో కొన్ని దేశాలు చేసిన ప్రతిపాదనలు సరికాదని చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి అనేది అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన ప్రక్రియ అని తెలిపారు. లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలో వ్యాక్సిన్‌ను అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని థామస్‌ క్వెనీ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/