పింఛను ప్రదర్శనకారులకు తాత్కాలిక ఉపసంహరణ

French
French

పారిస్‌: పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా గత అయిదువారాలుగా కొనసాగిస్తున్న పోరాటానికి దిగొచ్చిన ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మాక్రాన్‌ ఈ సంస్కరణలను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రధాని ఎడురాడో ఫిలిప్‌కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో రిటైర్మెంట్‌ వయోపరిమితిని 62 నుండి 64 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను ఉపసంహరించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కార్మికుల డిమాండ్లను ఇన్నాళ్లు మొండిగా నిరాకరిస్తూ వచ్చిన అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మాక్రాన్‌ చివరికి రాజీకి వచ్చారు. అయితే సంస్కరణలను అనుకూలిస్తున్న కార్మిక సంఘాలు ఎఫ్‌డిటి, యున్సా, ఎఫ్‌ఆర్‌సిలు ఈ ప్రతిపాదనలను స్వాగతిస్తూ స్థిరమైన పెన్షన్‌ విధానంలో తాము యజమానులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించాయి. అయితే ఈ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిజిటి, ఎఫ్‌ఓ, సోలిడైర్స్‌ యూనియన్లు మాత్రం ప్రధాని ప్రతిపాదనను వ్యతిరేకించాయి. సమ్మెను, నిరసనలను కొనసాగిస్తామని ప్రకటించిన ఈ యూనియన్లు ఈ నెల 16న భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. సంస్కరణల అనుకూల సంఘాలు సమ్మె విరమించేందుకు సంసిద్ధత ప్రకటించటాన్ని సిజిటి అధినేత ఫిలిప్‌ మార్టినెజ్‌ తోసిపుచ్చారు. సమ్మె కొనసాగిస్తున్న వర్గాలపై ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావమూ చూపబోదని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రైవేటు రంగ కార్మికులు మాత్రం కార్మిక సంఘాల నాయకత్వాన్ని అనుసరించకుండా సమ్మెలో కొనసాగేందుకే కృతనిశ్చయంతో వున్నట్లు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/