తెలంగాణలో 43.3 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌‌తో పాటు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు నెమ్మదిగా 40కి చేరుకుంటున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది.

ఆదిలాబాద్‌‌లోని చాప్రాలలో 43.3 డిగ్రీలు, ఆదిలాబాద్‌‌ అర్బన్‌‌లో 43.2, కుమ్రంభీంలోని కెరమెరిలో 43.1, జగిత్యాలలోని మద్దుట్లలో 43, వనపర్తిలోని కేతేపల్లి, నిజామాబాద్‌‌లోని సిరికొండలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న నాలుగురోజులు ఎండలు ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్‌‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఇక, జంట నగరాల్లో మంగళవారం 39.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువ. రాబోయే రెండు రోజుల్లో ఇది 40 డిగ్రీల సెల్సియస్‌కి చేరుకునే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/