తెరచుకోనున్న ఆలయాలు.. తీర్థ ప్రసాదాల్లేవ్‌

కొత్త విధి విధానాలు విడుదల చేసిన కేంద్రం

Tirumala Srivari Temple
Temple

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల విరామం తర్వాత సోమవారం నుంచి పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోనున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దేవాలయాలలోకి భక్తులు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు విడివిడిగా ద్వారాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒక్కొక్కరి మధ్యా కనీసం 6 అడుగుల దూరం తప్పనిసరిగా ఉండాలని సూచించింది. ఆలయంలోకి వెళ్లే ముందు భక్తులు విధిగా చేతులను, కాళ్లను సబ్బుతో కడుక్కోవాలని, ప్రార్థనా స్థలాల్లో భక్తులు కూర్చునే చాపలను ఎవరికి వారే తెచ్చుకోవాలని పేర్కొంది. దేవతా విగ్రహాలు, అక్కడి గోడలపై ఉండే శిల్పాలను తాకేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కాగా కేంద్రం, భక్తుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేవాలయంలోనూ భగవంతుడికి ప్రసాదాలు సమర్పించడం, స్వీకరించడం, తీర్థం తీసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో అందరూ కలిసి ఆలయాల్లో భజనలు చేయడాన్ని కూడా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. భజన గీతాలను కేవలం రికార్డుల ద్వారా మైకుల నుంచి మాత్రమే వినిపించాలని ఆదేశించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/