అమెరికాలో పెరిగిన ‘తెలుగు’ మాట్లాడేవారి సంఖ్య

america
america

వాషింగ్టన్: అమెరికాలో అత్యధికులు మాట్లాడే భారతీయ భాషలలో హిందీ ప్రథమ స్థానంలో ఉంది. 2018 జులై 1 నాటికి మొత్తం 8.74 లక్షల మంది హిందీ మాట్లాడేవారు అమెరికాలో ఉన్నారు. తర్వాతి స్థానంలో గుజరాతీ, తెలుగు ఉండడం విశేషం. 2017తో పోలిస్తే అమెరికాలో హిందీ మాట్లాడేవారి సంఖ్య 1.3 శాతం పెరిగింది. 2010 నుంచి అమెరికాలో హిందీ మాట్లాడేవారి సంఖ్య దాదాపు 43.5 శాతం అంటే 2.65 లక్షలు పెరిగింది. అదే విధంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య కూడా గడచిన 8 సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. గత ఎనిమిదేళ్లలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 79.5 శాతం పెరిగింది. అమెరికాలో తెలుగు మాట్లాడేవారి జనాభా 2.23 లక్షల నుంచి 4 లక్షలకు పెరగడం విశేషం. 2018 నాటి అమెరికన్ కమ్యూనిటీ సర్వే లెక్కల ప్రకారం అమెరికాలో నివసించే ఐదేళ్లు పైబడిన 6.73 కోట్ల మందిలో ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్‌తో పాటు మరో భాష మాట్లాడుతారు.

ఇక అమెరికాలో మాట్లాడే ఇతర భారతీయ భాషలలో బెంగాలీలు తరువాతి స్థానంలో ఉంటారు. గత ఎనిమిదేశల్లలో బెంగాలీ మాట్లాడే ప్రజల సంఖ్య 68 శాతం పెరిగి 3.75 లక్షలకు చేరుకుంది. తమిళ భాషను మాట్లాడేవారి సంఖ్య కూడా 67.5 శాతం పెరిగింది. ఇదిలా ఉంటే 2017, 2018 సంవత్సరాలలో అమెరికాలో తెలుగు, గుజరాతీ మాట్లాడే ప్రజల సంఖ్య తగ్గింది. అమెరికాలో మొత్తం 4.19 లక్షల మంది గుజరాతీలు ఉన్నారు. 2017తో పోలిస్తే వీరి సంఖ్య 3.5 శాతం తగ్గింది. అదే విధంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య 2017తో పోలిస్తే 2018లో 15 వేలు తగ్గింది. ప్రస్తుతం అమెరికాలో తెలుగు మాట్లాడేవారు 4 లక్షల మంది ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/