డిసెంబర్ లోనే అసలైన సినీ సంక్రాంతి మొదలు

సంక్రాంతి వస్తుందంటే సినీ ప్రేమికులకు సంబరమే. తమ అభిమాన హీరోల చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. ఈసారి కూడా అదే రీతిలో రిలీజ్ కాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ , భీమ్లా నాయక్ , రాధే శ్యామ్ వంటి భారీ చిత్రాలు బరిలోకి దిగబోతున్నాయి. అయితే అంతకంటే ముందే డిసెంబర్ సినీ సందడి మొదలుకాబోతుంది.

డిసెంబర్ -2 న బాలయ్య అఖండ రిలీజ్ కాబోతుంది. బాలయ్య-బోయపాటి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ‘సింహా’, ‘లెజెండ్’ బ్లాక్​బస్టర్లుగా నిలవడం వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లే ట్రైలర్​, పాటలు రూపొందించారు! ఇటీవల విడుదలైన అవి అలరిస్తూ.. చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ప్రేక్షకులను ఆత్రుతగా ఎదురుచూసేలా చేస్తోంది.

డిసెంబరు 4 న స్కైలాబ్ చిత్రం రాబోతుంది. అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన స్కైలాబ్​ ఉపగ్రహం సాంకేతిక కారణాలతో భూమిపై పడిపోనుందనే నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. నిత్యామేనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలంగాణలోని బండ లింగపల్లి అనే పల్లెటూరిలో 1979 టైమ్​ పీరియాడ్​లో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా తీశారు.

డిసెంబర్ 10 న గుడ్​లక్ సఖి చిత్రం రాబోతుంది. కీర్తి సురేశ్​ , జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా..ప్రతి సారి వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్ గా డిసెంబర్ 10 న రాబోతుందని ప్రకటించారు.

డిసెంబరు 17 న పుష్ప రాబోతుంది. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన ఈ పాన్ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, లుక్స్​ రోజురోజుకూ హైప్ పెంచుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తీస్తున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్​ నుంచి డాన్​గా మారిన పాత్రలో బన్నీ కనిపించనున్నట్లు తెలుస్తోంది.రష్మిక హీరోయిన్​గా నటిస్తుండగా, సమంత స్పెషల్ సాంగ్ చేయనుంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ప్రతినాయక పాత్రల్లో కనిపించనుండటం విశేషం.

డిసెంబరు 24 న ‘గని’ , ‘శ్యామ్​సింగరాయ్’ చిత్రాలు రాబోతున్నాయి. నాని ‘శ్యామ్​సింగరాయ్’గా థియేటర్లలోకి రానున్నారు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తుండగా.. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్​ హీరోయిన్లు. ఇక గని విషయానికి వస్తే..ఈ మూవీ లో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నారు. మొత్తం మీద సినీ ప్రేమికులకు సంక్రాంతి కంటే ముందే సినీ సంక్రాంతి డిసెంబర్ లో మొదలుకాబోతుంది.