వాడి వేడిగా కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. రెండో రోజు 24 గంటల ఉచిత విద్యుత్ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో 24 గంటల సరఫరా జరుగుతుందని అన్నారు. కరెంట్ రావడం లేదని కొందరు సైకో ఫ్యాన్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ అడ్డుపడ్డారు. దీంతో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మంత్రి కాదు అలాంటప్పుడు జీవన్ రెడ్డి మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగించిన జీవన్ రెడ్డి వాస్తవాలకు భిన్నంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు.

క్షేత్రస్థాయిలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. దీనిపై ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడానని జీవన్ రెడ్డి అనగా.. సభలో లేని వ్యక్తుల పేర్లు తీయొద్దని చైర్మన్ సూచించారు. ఆ పదాలను శాసనమండలి రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కరెంట్ ఇబ్బందులు ఉన్నాయో ఆ వివరాలను మంత్రికి తెలియజేస్తే ఆయన సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు.

అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అక్బరుద్దీన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులు జరుగుతున్నాయని, నాలుగున్నరేళ్ళలో కేవలం 64 రోజుల పాటు మాత్రమే సభ జరిగిందని ఆరోపించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదని కేటీఆర్ అన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదన్నారు. అసెంబ్లీ తక్కువ రోజులు అంటున్నారు. కానీ, రెండేళ్ల కరోనా ను మరచిపోయారని చెప్పారు. కేటీఆర్ కామెంట్స్ కు అక్బరుద్దీన్ సమాధానంగా… తానేమీ కొత్త సభ్యున్ని కాదని, మీకు సహనం తక్కువవుతోందని విమర్శాత్మక కామెంట్స్ చేశారు.