అధిష్టానం చెపితే ఎంపిగా పోటి

విద్యానగర్‌; అధిష్టానం ఆదేశిస్తే సికింద్రాబాద్‌ ఎంపిగా పోటిచేస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజి ఎమ్మెల్యే డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ప్రకటించారు. అదికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం అంకితబావంతో పనిచేస్తానని చెప్పారు. ముషీరాబాద్‌ బిజెపి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మహిళా సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రజల అండదండలు, పార్టీ ప్రోత్సహంతోనే అనేక పదవులు వచ్చాయని, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ముషీరాబాద్‌ ప్రగతికి బాటలు వేసానని చెప్పారు. జనాభాలో సగభాగమున్న మహిళల సంక్షేమమే బిజెపి లక్ష్యమని, విద్యా ఉద్యోగ, రాజకీయ రంగాల్లోను వారికి సమాన వాటా కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. కాని అధికార టిఆర్‌ఎస్‌ మాత్రం ముహిళలను మరిచిందని, మంత్రి వర్గంలో ఒక్క మహిళకు స్థానం కల్పించకపోగా ఆ పార్టీ పెద్దలకు కవిత మాత్రమే మహిళగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. కాని రక్షణ, విదేశాంగ వంటి కీలక శాఖలను మహిళలకు కట్టబెట్టిన ఘనత ప్రధాని మోడికే దక్కుతుందన్నారు. మళ్లీ మోదిని ప్రధాన మంత్రిని చేసేందుకు తెలంగాణలోని 17 ఎంపి సీట్లను బిజెపికి కట్టబెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసి పారిశుధ్య కార్మికులను లక్ష్మణ్‌ సత్కరించారు. బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలు ఆకుల విజయ, కార్యదర్శి రేష్మారాథోడ్‌, గీత, పద్మజ, పార్టీ నేతలు బద్రినారాయణ, ఆర్‌ విశ్వం, శివముదిరాజ్‌, దీన్‌దయాల్‌రెడ్డిలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

https://www.vaartha.com/telengana/
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: