ఫ్లోరిన్‌ భూతం కాంగ్రెస్‌ పాపమే

Jagadeesh Reddy
Jagadeesh Reddy

నల్లగొండ: కాంగ్రెస్‌ నేతల అసమర్ధత వల్లనే నల్లగొండ జిల్లాలో ఫ్లోరిన్‌ భూతం విజృంభించిందని రాZష విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం నల్ల గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతల చేతుల్లో చిక్కి ఉమ్మడి నల్లగొండ జిల్లా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికా రంలో ఉన్నా జిల్లాను ఏలిన నేతలు వారేనని అటువంటి నేతలే ఫ్యూడల్‌ భావజాలంతో అభివృద్ధి నిరోధకులుగా నిలిచారని దుయ్యబట్టారు. మొన్నటి శాసన సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ప్రకటించినందుకే ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని ఎద్దేవ చేశారు. మొన్న జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లోను నల్లగొండ భువనగిరి స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. ప్రస్తుత ప్రాదేశిక ఎన్నికల్లోను మూడు జిల్లా పరిషత స్థానాలను కైవసం చేసుకుంటామని జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశాడు.
కాంగ్రెస్‌, తెలుగుదేవం ఏలుబడిలో దేవరకొండ, మునుగోడులతోపాటు నకిరేకల్‌లో అభివృద్ధే లేదని ఇప్పుడు ఈ ప్రాంతాల్లో పంట పొలాలకు సమృద్ధిగా నీరందుతుందన్నారు. సిఎం కెసిఆర్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబి గూటికి చేరారని చెప్పారు. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేషం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల పరిశీలకులు టి.రవీందర్‌రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్‌, భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచెర్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.