గోల్కొండలో పంద్రాగస్టుకు ఏర్పాట్లు

Golconda
Golconda

హైదరాబాద్‌: గోల్కొండ కోట లో 15న నిర్వహించనున్న ఇండిపెండెన్స్ డే పరేడ్‌కు వచ్చే వారు తమ వెంట ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు వచ్చే వారు తమతో హ్యాండ్ బ్యాగులు, బ్రీఫ్ కేసులు, కెమెరాలు, టిఫిన్ క్యారియర్లు తదితర వస్తువులు తీసుకురావద్దని కోరారు. ఎవరైనా వస్తువులు తీసుకువస్తే వాటిని తప్పనిసరిగా తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్స వేడుకలు ప్రశాంతం గా జరిగేలా ప్రజలు పోలీసులకు తమవంతు సహకారాన్ని అందిచాలని, భద్రతా చర్యల్లో భాగంగా పలు ఆంక్షలు విధించామని తెలిపా రు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ట్రాఫిక్ ఆంక్ష లు కూడా ఉంటాయని తెలిపారు. వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏరియాలను కేటాయించామని పేర్కొన్నారు. ఎ,బి,సి,డి పాస్‌ల వారీగా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే తమ వాహనాలను నిలుపుకుని పోలీసులకు సహకరించాలని సిపి తెలిపారు.


ఏర్పాట్లు చకచకా..


పంద్రాగస్టు దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటలో నిర్వహించనున్న జెండావందనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యుత్, జిహెచ్‌ఎంసి, అటవీ శాఖ అధికారులు తెలిపారు. గోల్కొండకు వెళ్లే మార్గాల రోడ్లకు మరమ్మతులు, పారిశుద్ధం పనులను జిహెచ్‌ఎంసి అధికారులు చేపట్టారు. ప్రత్యేక ఆకర్షణ కోసం పలు రకాల పూల మొక్కలు, లైట్ల ఏర్పాట్లు, గోల్కొండ కోటను మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. వివిఐపి, విఐపిలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారి వచ్చే మార్గాల్లో సామాన్యులు రాకుండా ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రానున్న మార్గాల్లో జాగిలాలతో ప్రత్యేక పోలీసుల బృందం తనిఖీలు చేసింది. జెండా ఆవిష్కరణ చేసే ప్రాంతాన్ని, పోలీసుల గౌరవ వందనం చేసే ప్రాంతాన్ని అనువణువునా పోలీసులు తనిఖీ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/