వరంగల్‌లో కదం తొక్కిన కాంగ్రెస్‌

Dharna

వరంగల్‌ : ఇంటర్‌ విద్యార్థుల పాలిట శాపంగా మారిన బోర్డు తప్పిదాలను నిరసిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలన్న డిమాండ్‌తో వరంగల్‌ నగరంలో కాంగ్రెస్‌ కదం తొక్కింది. పార్టీ అగ్ర నాయకురాలు, ప్రచారసారథి, సినీనటి విజయశాంంతితో సహా అగ్రనేతలు హన్మకొండ ఏకశిలా పార్కువద్ద బైఠాయించారు. ప్రభుత్వం, ప్రజావ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఆ తరువాత సిఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన విజయశాంతి కలెక్టరేట్‌ ముట్టడికి బయలుదేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయశాంతి వెంట మాజీమంత్రి కొండా సురేఖ, డిసిసి నేత నాయిని రాజెందర్‌రెడ్డితో సహా ప్రముఖులు ఆందోళన చేపట్టి ఉధృతం చేశారు. దీంతో పోలీసులు భారీగా రంగప్రవేశం చేసి కాంగ్రెస్‌ ఆందోళన కారులందరినీ తాత్కాలిక బారికేడ్లతో అడ్డుకుని అరెస్ట్‌ చేయడమే కాక హసన్‌పర్తి పోలీసు స్టేషన్‌కు తరలించారు.


త్రినగరిలో బుధవారం ఒకదాని వెంట ఒకటిగా సంభవించిన నాటకీయమైన పరిణామాల నేపథ్యంలో ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్‌ ఆందోళనను చేపట్టింది. ఈ సందర్భంగా విజయ శాంతి వెంట కొండా సురేఖ, నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు కట్ల శ్రీనివాస్‌, ఇవి.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, నగర, జిల్లా కాంగ్రెస్‌ నాయకులంతా ఆందోళనను చేపట్టారు. ఒక్కొక్కరుగా ఏకశిల పార్కుకు చేరుకున్నాక ధర్నా కొనసాగింది. దీనికనుగుణంగా నిరసనలు పెల్లుబికడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకపక్క ధర్నానుద్ధేశించి విజయశాంతి మాట్లాడుతూ ఇంటర్‌ విద్యార్థులకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రంగాల్లో వైఫల్యం చెందారని..16 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఆయన గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ ఫలితాలు ఆద్యంతం లోపభూయష్టంగా మారిందని..ఎలాంటి అనుభవం లేని సంస్థకు మూల్యాంకనం అప్పగించడం వల్లే పరిస్థితి చేదాటి పోయిందని విమర్శించారు. గోబరినా సంస్థ వెనుక ఉన్న పెద్దలెవరో బయటకు రావాలని, విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయశాంతి కోరారు. ఆమె తన ప్రసంగంలో అత్యంత ఆవేశంగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఇంటర్‌ విద్యార్థుల సమస్యలను పక్కనబెట్టి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలులో కేసీఆర్‌ బిజిగా ఉన్నారని విమర్శించారు. ఒక్కొక్కరికి రూ.30 కోట్లు ఇచ్చి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపించారు.
కాగా, ఇతర నేతలు సైతం ధర్నానుద్ధేశించి ప్రసంగించిన సందర్భంలో పోలీసులు మోహరించడం, ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్‌ వైపు వారు బయలుదేరిన సమయంలో పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు తావిచ్చింది. పరస్పర తోపులాటలు, పెనుగులాటల మధ్య విజయశాంతి సహా కొండా సురేఖ, నాయిని రాజెందర్‌రెెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్‌ చేసి హసన్‌పర్తి పోలస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా గంటకు పైగా ఆందోళనలు కొనసాగాయి. ఇంటర్‌మీడియట్‌ విద్యార్థులందరికీ న్యాయం జరిగే ఉద్యమం కొనసాగుతుందని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించారు.