ప్రయాణికులపై ఛార్జీ భారం మోపవద్దు – భట్టి

ప్రయాణికులపై ఛార్జీ భారం మోపకుండా ఆర్టీసీని బలోపేతం చేయాల్సి ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలవుతుందని .. ఈ స్కీం కింద ఇప్పటివరకు రూ.6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని.. ఈ స్కీమ్ ను ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

బుధవారం సచివాలయంలో టీఎస్ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మల్లు భట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రయాణికులపై ఛార్జీల భారం మోపకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడంపై ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. టీఎస్ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. నిర్వహణ వ్యయం మేరకు కావాల్సిన నిధులను సంస్థకు సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.

ఆర్టీసీ సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్ మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన సంస్థ దృష్టి పెట్టి.. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు.