టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితను అనర్హురాలిగా ప్రకటించాలి

ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతాం..ఉత్తమ్ కుమార్ రెడ్డి

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో కల్వకుంట్ల కవిత టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిజామాబాద్ లోక్ సభ స్థానంలో ఓటమిపాలైన కవితను ఎమ్మెల్సీగా పోటీకి దింపారని అన్నారు. కవిత ప్రజాతీర్పు ద్వారా ఓటమిపాలైందని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో సమావేశాలు పెట్టుకోవద్దని విపక్షాలకు చెబుతున్నారని, కానీ టిఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం సమావేశాలు జరుపుకుంటున్నారని, క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నారని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.

ఎంపీటీసీలను సంతలో పశువుల్లా కొంటున్నారని, పార్టీల వారీగా జాబితాలు ప్రకటించి మరీ కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీలను కొనేందుకు అంత డబ్బు ఎక్కడిది అని ప్రశ్నించారు. రాజకీయాలను కేసీఆర్ వ్యాపారంగా మార్చేశారని, ఇది టిఆర్ఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు కాదా? అని నిలదీశారు. టిఆర్ఎస్ అభ్యర్థి కవితను అనర్హురాలిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వస్తే అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయని భావిస్తే, సిఎం కెసిఆర్‌ మాత్రం బరితెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కెసిఆర్ వంటి నేతను తన రాజకీయ అనుభవంలో ఇంతవరకు చూడలేదని వ్యాఖ్యానించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/