ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు తెలంగాణ ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 200 సంవత్సరాల కిందట నుంచి ఆనవాయితీగా సెంటిమెంట్ గా వస్తున్న జాతర అన్నారు. సికింద్రాబాద్ లో స్థలం చాలా చిన్నగా ఉన్నా లక్షలాదిమంది భక్తులు వచ్చి బోనాలని సమర్పించుకుంటారు చాలా సెంటిమెంట్ గా భావిస్తారని వివరించారు. హైదరాబాద్ మొత్తం కొన్ని వేలలో ఆలయాలు ఉన్నా కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ప్రత్యేకత అన్నారు.

తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానుండటంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌ అంజలి టాకీస్‌ వైపు నుంచి వీఐపీలకు-1, సాధారణ భక్తులకు-1 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్‌పేట్‌ పీఎస్‌ నుంచి సాధారణ భక్తుల క్యూలైన్‌ ఉంటుంది. డోనర్‌ పాస్‌ల కోసం ఎంజీ రోడ్డులో ఆలయం వెనక వైపు నుంచి మరో క్యూలైన్‌ ఉంటుంది. ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురు నుంచి వీవీఐపీలకు అమ్మవారి ఆర్చిగేట్‌ ద్వారా అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.