ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్టు

కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం

ashwathama-reddy
ashwathama-reddy

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఈ రోజు ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు ప్రయత్నించిన కొందరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హిమాయత్ నగర్ లిబర్టీ వద్ద ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ నేతలు భట్టివిక్రమార్క, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పలు జిల్లాల్లో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే, హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. అటువైపుగా వాహనదారులను వెళ్లనివ్వట్లేదు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ను పూర్తిగా మూసేస్తున్నామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ నిరసన ప్రదర్శలను కొనసాగిస్తున్నారు. నేతల గృహ నిర్బంధాలపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్బంధాన్ని దేశంలో తాను ఎక్కడా చూడలేదని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/