తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ సమ్మె నోటీసు

TS RTC
TS RTC

Hyderabad:  తెలంగాణ ఆర్టీసి యాజమాన్యానికి జేఏసీ తరపున సమ్మె నోటీసు అందింది. టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. ​ఏపీలో ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పారు. తెలంగాణాలో ​​మంత్రి వర్గ ఉప సంఘం చేసిన సిపార్సులను ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ​​సకల జనుల సమ్మెలో 20రోజులు పోరాడిన కార్మికులను ప్రభుత్వం దూరం పెట్టిందన్నారు.  ​​

ఆర్టీసీని నష్టాల పేరుతో బదనాం చేస్తున్నారని చెబుతూ ​​సంస్థ నష్టాల్లో లేదని,   ఓఆర్  పెరిగిందని,  ​​ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా నష్టాల పేరు ఎత్తుతోందని విమర్శించారు.  ​​ ​​లాభనష్టాలతో సంబంధం  లేకుండా సంస్థను ప్రభుత్వం కాపాడాలన్నారు.  ​​23,24 తేదీల్లో డిపోల ముందు ధర్నాలు  కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి  ​​2013 లోనే  ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. ​​​ఆర్టీసీ విలీనం పై హర్యానా, పంజాబ్ వెళ్ళి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చామన్నారు.

​ప్రభుత్వం దీనిపై స్పందించక పోతే ఉధ్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ అన్ని యూనియన్లు సంస్థను కాపాడుకునేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తాయని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ లో ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ​​కార్మికులను తగ్గించినా సంస్థకు ఆదాయం పెంచామని రాజిరెడ్డి చెప్పారు. ​​సమ్మె అనివార్యం అయితే ప్రభుత్వం అందుకు బాధ్యత వహించాలన్నారు.

​23,24 తేదీల్లో లంచ్ అవర్ లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ​​23న చర్చలకు రమ్మని కార్మిక శాఖ పిలిచిందని, జేఏసీ తరపున చర్చలకు వెళతామని చెప్పారు.