తాత్కాలికంగా ఆ ప్రాజెక్టును ఆపాలి..శ్రీనివాస్​ గౌడ్​

ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరం..మంత్రి శ్రీనివాస్ గౌడ్

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : రెండు రాష్ట్రాలకు మంచి జరగాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అనుమతులు తెచ్చుకున్న తర్వాత ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకుపోవాలన్నారు. ఇవ్వాళ ఆయన మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాలపై వివాదాలను ఏపీ ఆపాలని హితవు చెప్పారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమన్నారు.

తెలంగాణలో వ్యాపారాలు అడ్డుకుంటున్నారని తెలంగాణలోని ఏపీ ప్రజలు ఏనాడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. వారి ఆస్తులు, ఉద్యోగాలు, పరిశ్రమలకు తాము ఏమైనా ఇబ్బందులు పెట్టామా? అని నిలదీశారు. ఈ ఏడేళ్లలో హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ ప్రజలు ఇబ్బంది పడ్డారా? అని మరో ప్రశ్న వేశారు. తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రా ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌టం లేద‌న్నారు. హైద‌రాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌న్నారు. 

తెలంగాణలోని కాలనీలు, పార్కులకు పెట్టిన ఆంధ్రా వారి పేర్లను తామేమైనా తొలగించామా? అని అడిగారు. అసలు ఆనాడు ఆంధ్రా నేతలే తెలంగాణ అన్న పదాన్నే అసెంబ్లీలో పలకకుండా చేశారని మండిపడ్డారు. వేలాది మంది మరణాలకు నాటి ఆంధ్ర నాయకులే కారణమన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/