లాలాపేట్‌లో పర్యటించిన మంత్రి కెటిఆర్‌

KTR tours in Lalapet, hands over Rs 10,000 cheques

హైదరాబాద్‌: రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి కెటిఆర్‌ భారీ వర్షాల నేప‌థ్యంలో ముంపున‌కు గురైన లాలాపేట్‌లో ప‌ర్య‌టించారు. వ‌ర‌ద ప్ర‌భావానికి గురైన కాల‌నీల్లో కెటిఆర్ ప‌ర్య‌టించి, వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు రూ. 10 వేల చొప్పున ప‌రిహారం అంద‌జేశారు. బాధితులంద‌రికీ అండ‌గా ఉంటామ‌ని కెటిఆర్ భ‌రోసా ఇచ్చారు. కెటిఆర్ వెంట డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్‌, స్థానిక కార్పొరేట‌ర్లు ఉన్నారు.

మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ముమ్మరంగా కొన‌సాగుతోంది. తొలిరోజు 1036 మందికి రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించినట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. బాధితులకు నగదు పంపిణీలో మంగళవారం 100 టీంలు పాల్గొన్నాయి. ఒక్కో టీంలో ముగ్గురిని నియమించారు. టీంల సంఖ్యను బుధవారం నుంచి రెట్టింపు చేయనున్నారు. ఈ సంఖ్యను 200లకు పెంచి ఆర్థిక సాయం అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. నగదు పంపిణీ కార్యక్రమాన్ని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఓవైపు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూనే మరోవైపు వరద కట్టడికి, కాలనీలను శుభ్రం చేసే ప్రక్రియను పర్యవేక్షించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/