కార్యాలయాల వల్ల రైతులకు ఒరిగిందేంటి?

నిజామాబాద్‌ స్పైస్‌ బోర్డు కార్యాలయంపై ఎమ్మెల్యె జీవన్‌ రెడ్డి వ్యాఖ్య

TRS MLA Jeevan Reddy
TRS MLA Jeevan Reddy

నిజామాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తాజాగా నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్న డివిజనల్‌ కార్యాలయం, ప్రమోషనల్‌ కార్యాలయాలపై టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యె జీవన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసలు కేంద్రం ఇచ్చింది పసుపు బోర్డు కాదని.. స్పైసెస్‌ బోర్డు యొక్క రీజనల్‌ ఆఫీస్‌ మాత్రమేనని ఆయన అన్నారు. ఇప్పటికే రీజినల్‌ ఆఫీస్‌లు ఆరు ఉన్నాయని.. కొత్తగా మరొకటి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి కార్యాలయాన్ని గతంలోనే ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని జీవన్‌ రెడ్డి అన్నారు. అయితే దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కూడా కేటాయించిదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తానన్న కార్యాలయాన్ని ఆయన పాచిపోయిన అన్నంతో పోల్చారు. కేంద్రం పాచి పోయిన అన్నాన్ని నిజామాబాద్ రైతులకు వడ్డిస్తోందని విమర్శించారు. దీనిపై రైతులకు వాస్తవాలు త్వరలోనే అర్ధమవుతాయని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నిజామాబాద్ కు పసువు బోర్డుపై కేంద్రానివి ,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌వి నకిలీ మాటలని జీవన్ రెడ్డి మండిపడ్డారు. పసుపు బోర్డుపై బీజేపీ నేత రాం మాధవ్ మాయ మాటలు చెప్పారని ..తెచ్చామని ఇప్పుడు ట్వీట్ చేస్తున్నారని ఆరోపించారు. బిర్యానీ అడిగితే పాచి అన్నం పెడతారా ? అని అన్నారు. పసుపు బోర్డు నిజామాబాద్ తెలంగాణ రైతుల హక్కు అని అన్నారు. ఇప్పటికే వరంగల్ ,గుంటూరు లో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వాటితో రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. అరవింద్ ఓ నకిలీ ఎంపీ అని..నకిలీ జీఓలతో మాయ చేస్తుంటారని విమర్శించారు. ఐదు పంటలకు ఏ విధంగా బోర్డులున్నాయో పసుపు పంటకు కూడా అదే బోర్డు కావాలని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/