అన్నపూర్ణ క్యాంటీన్ల మార్పులో ప్రభుత్వం

సిఎం కెసిఆర్‌ కొత్త ఆలోచనతో మారనున్న క్యాంటీన్ల రూపురేఖలు

GHMC annapurna canteen
GHMC annapurna canteen

హైదరాబాద్‌: జిహెచ్‌ఎంసి పరిధిలోని ఎంపిక చేసిన అన్ని క్యాంటీన్లను ఆధునికీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదలకు రూ.5కే భోజనాన్ని అందిస్తున్న క్యాంటీన్ల రూపు రేఖలు మారనున్నాయి. ప్రస్తుతం ఓ డబ్బా మాదిరిగా ఉన్న క్యాంటీన్ల వద్ద అక్కడే నిలబడి భోజనం చేస్తున్నారు. అయితే తెలంగాణ సిఎం కెసిఆర్‌ అన్నపూర్ణ క్యాంటీన్ల రూపు రేఖలను మార్చాలని, పేదలు కూర్చుని కడుపునిండా తినే పరిస్థితి కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు క్యాంటీన్ల విస్తీర్ణాన్ని పెంచి, డైనింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం రూ. 8.70 లక్షల వ్యయంతో 40 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో క్యాంటీన్లను మార్చనున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్‌ చౌరస్తాలోని అన్నపూర్ణ క్యాంటీన్‌ను మార్చారు. మరో 20 రోజుల్లో ఈ సెంటర్‌లో కనీసం 35 మంది కూర్చుని తినేలా సదుపాయాలను సమకూర్చుతున్నారు. చేతులు కడుక్కునేందుకు వాష్‌ బేసిన్‌, ఫ్యాన్లు, స్టీల్‌ ప్లేట్‌లో భోజనం చేయవచ్చని అధికారులు అంటున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/